లోలోతుకు.. భూగర్భ జలాలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:32 PM
కర్నూలు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితిపై గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ విడుదల చేసిన 2026 నివేదిక దిగ్ర్భాంతికర వాస్తవాన్ని బయటపెట్టింది.
జిల్లాలో అత్యంత లోతైన నీటి మట్టం 29.78 మీటర్లు కోసిగిలోనే
జిల్లా సగటు 6.6 మీటర్లు.. కోసిగిలో ఐదింతల లోతు
ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్
సి. బెళగల్ మండలంలో 0.77 మీటర్లకే నీరు
పెద్దకడుబూరు మండలంలో కేవలం2 మీటర్లకే నీరు
కోసిగి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితిపై గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ విడుదల చేసిన 2026 నివేదిక దిగ్ర్భాంతికర వాస్తవాన్ని బయటపెట్టింది. జిల్లాలో అత్యంత లోతైన నీటి మట్టం 29.78 మీటర్లు కోసిగిలోనే ఉన్నట్లు తేలింది. నిజానికి ఇది గత ఏడాది కంటే తక్కువే. 2025లో ఏకంగా 39 మీటర్లకు పడిపోయింది. దానితో పోల్చితే ఈ ఏడాది కాస్త తక్కువ అయినప్పటికీ ఇదో ప్రమాద సూచికగా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సగటు భూగర్భ జలాల మట్టం 6.6 మీటర్లు. దీనితో పోల్చితే కోసిగిలో ఐదింతలు అట్టడుగుకు పడిపోయింది. గురువారం కోసిగి మండలంలో పర్యటించిన కలెక్టర్ డా.ఏ.సిరి భూగర్భ జలాల నీటి మట్టం 29.78 మీటర్లకు పడిపోయిందని పీజోమీటర్ల ద్వారా నమోదైన గణాంకాలను అధికారులకు, రైతులకు తెలియజేశారు. కోసిగి మండలంలోని వందగల్లులో 29.78 మీటర్లు లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని, కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలంలోని కొత్తకోట గ్రామంలో 0.77 మీటర్లలో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లాలో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భగర్భ జలాలు ఉన్నది ఒక్క కోసిగి మండలమేనని అన్నారు. మండలంలో మెజారిటీ విస్తీర్ణం ఎర్రనేలల భూములు కావడం వల్ల వర్షం నీరు భూమిలో ఇంకడం లేదని కలెక్టర్ విశ్లేషించారు. కోసిగిలో భూగర్భ జలాలు 29.78 మీటర్లకు పడిపోగా.. పక్కనే ఉన్న పెద్దకడుబూరులో కేవలం 2 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతున్నదన్నారు. డీ. బెళగల్ గ్రామంలో 18 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2025-26 ఏడాదిలో జిల్లాలో 703.03 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇది సాధారణ వర్షపాతం 558.98 మీటర్ల కంటే 25.77 శాతం అధికమం అయినప్పటికీ కోసిగి మండలంలో సరైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆ నీరు వృథా అయిందని అన్నారు. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలంలో 4వేల బోర్లు ఉన్నాయని, ప్రస్తుతం బోర్ల మనుగడ ప్రశ్నార్థకం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఒక్క డీ. బెళగల్ గ్రామంలోనే 420 వ్యవసాయ బోర్లు ఉపయోగంలో ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 59 వేల బోర్లు ఉండగా.. కోసిగిలో నీటిమట్టం పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని, వేసవి తీవ్రత పెరిగితే.. ఈ మూడు నెలల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ సునీల్ కుమార్ తెలిపారు. వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా జలధార-జలహారతి ద్వారా పూడికతీత పనులు చేపట్టి చెరువుల సామర్థ్యం పెంచాలని వర్షం నీరు, వాగులు, వంకల ద్వారా నేరుగా చెరువులకు నీరు చేరేలా ముళ్ల కంపల అడ్డంకులు తొలగించాలన్నారు. ఉపాధి హామీ పతకం కింద చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు, బుష్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కోసిగి మండలంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోసిగిమండలంలో అత్యంత లోతైన నీటిమట్టం
కోసిగి మండలంలో భూగర్భ జలాలు 29.78 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చెరువులు, కుంటలను అధికారులు బాగు చేసి కోసిగిలో భూగర్భ జలాలను పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి.
డా.ఏ. సిరి, కలెక్టర్