తగ్గుతున్న నీటి నిల్వలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:19 AM
శ్రీశైలం రిజర్వాయరులో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. సప్తనదుల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరాలయ గోపురం మెల్లమెల్లగా భక్తులకు దర్శనమిస్తోంది.
బయల్పడిన సంగమేశ్వరాలయ గోపురం
కొత్తపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయరులో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. సప్తనదుల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరాలయ గోపురం మెల్లమెల్లగా భక్తులకు దర్శనమిస్తోంది. శ్రీశైలం రిజర్వాయరు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ఆదివారం 855.90 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వలు 215టీఎంసీలు కాగా 94.2380 టీఎంసీలుగా నమోదు కావడంతో ఆలయ గోపురం భక్తులకు దర్శనమిచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈఏడాది వర్షాలు లేకపోయినా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం రిజర్వాయరుకు భారీస్థాయిలో వరద వచ్చి చేరింది. ఈనేపథ్యంలో సప్తనదుల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరాలయం ఆగస్టు 6న జలాధివాసమైంది. సంగమేశ్వరాలయ గోపురం కేవలం నెలన్నర వ్యవధిలోనే బయల్పడి భక్తులకు దర్శనమిచ్చింది. ఏదీ ఏమైనా ఇలాగే నీటిని దిగువకు విడుదల కొనసాగిస్తే కేవలం అక్టోబరు 10లోపు సంగమేశ్వరాలయం పూర్తిగా బయల్పడి భక్తులకు దర్శనమిచ్చే అవకాశముంది.