కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:09 AM
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోడుమూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు వేసిన పత్తి, వేరుశనగ, సద్ద, జొన్న, కంది, మిరప పంటలన్నీ ఎండిపోయాయన్నారు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బ్యాంక్‌లోని రుణాలను మాఫీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శేషుకుమార్, రంగస్వామి, అచ్చన్న, శంకర్, గిడ్డయ్య, లక్ష్మయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ, రైతు సంఘం, ఏఐకెఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రామాంజనేయులు హాజరై మాట్లాడారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే అన్ని మండలాల్లో కరువు సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం రైతులకు వెంటనే ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ప్రకటించాలన్నారు. కార్యక్ర మంలో మునెప్ప, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, రాముడు పాల్గొన్నారు.