దినదిన గండం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:52 AM
: పట్టణంలోని బొగ్గులైన్ కాలనీవాసులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు అటు బొమ్మల సత్రం ఇటు నూనెపల్లె నుంచి ప్రారంభం కావడంతో మధ్యలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
ఇబ్బందుల్లో బొగ్గులైన్ కాలనీ వాసులు
చకచకా సాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
ఖాళీ చేయాల్సిందే అంటున్న అధికారులు
నంద్యాల హాస్పిటల్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బొగ్గులైన్ కాలనీవాసులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు అటు బొమ్మల సత్రం ఇటు నూనెపల్లె నుంచి ప్రారంభం కావడంతో మధ్యలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అధికారులు ప్రత్యామ్నాయం చూపడకపోవడంతో తాము ఎక్కడికి వెళ్లాలో అని అయోమయంలో ఉన్నారు. పనులు మాత్రం చకచకా సాగుతు న్నాయి. ఖాళీ చేయాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది పేరిట నంద్యాల లో ని నూనెపల్లి నుంచి బొమ్మల సత్రం వరకు రహాదారి సుంరీకరణ కోసం రూ 13.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాలనీవాసులు అడ్డుకోవడం, ప్రజాప్రతినిధులు తప్పించుకోవడంతో పనులకు అటంకం ఏర్పడింది. కాలనీ వాసులు లకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో గత ప్రభుత్వంలో కాలనీవాసులకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రాహ్మనందరెడ్డి అండగా ఉండి ప్రత్యామ్నాయం చూపే వరకు పనులు చేయవద్దని అధికారులను సూచించారు.
కొంతమేరకు ఖాళీ చేయించినా..
అప్పటి వైసీపీ ఓటు బ్యాంక్ కోసం పనులు నిలిపివేసింది. కొంతమేరకు ఖాళీ చేయించినా పనులు చేయక అసంపూర్తిగా ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం బొగ్గులైన్‌లో నివసిస్తున్న ప్రజలకు కునుకు లేకుండా పోయింది. దినదిన గండం లా జీవనం సాగిస్తున్నారు. గతంలో టిడ్కో భవనాల్లో మంజూరు చేసిన్పటికీ అక్కడ నివాసయోగ్యంగా లేకపోవడంతో వెళ్లలేకపోయారు. వృద్ధులు మూడవ అంతస్తులో భవనాలు కేటాయించడంతో పైకి ఎలా ఎక్కాలని ప్రశ్నిస్తున్నారు. 30 సంవత్సరాల కిందట సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూలి పనులు చేసుకుంటూ బొగ్గు లైన్లో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం నూనెపల్లె నుంచి బొమ్మల సత్రం వరకు రోడ్డు విస్తరణ డివైడర్, పుట్‌పాత్ పనులు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. 2.5 కిలోమీటర్ల పనులు చేయనున్నారు.
30 ఏళ్ల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం
బొగ్గు లైన్ కాలనీలో 30ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్నాం. ఇద్దరు ఆడపిల్లలున్నారు. కష్టపడి పని చేసుకుంటూ పిల్లల పోషణ చేస్తున్నా. ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయాలంటే ఆడపిల్లలతో ఎక్కడికి పోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. భూలక్ష్మి, స్థానికురాలు, బొగ్గులైన్ కాలనీ, నంద్యాల
టిడ్కోలో ఇళ్లు కేటాయించారు
గత ప్రభుత్వంలో మూడంతస్తులో టిడ్కో ఇళ్లు కేటాయించారు. అక్కడ ఎలాంటి జనవాసాలు లేవు. ఎలా జీవనం సాగించాలి. పైగా పడిపోయే పరిస్థితిలో ఉండగా సౌకర్యాలు లేవు. మూడవ అంతస్తు ఎక్కి దిగాలంటే ఎలా. షేక్ రహమత్‌బీ, స్థానికురాలు, నంద్యాల