పంట కోసం...
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:12 AM
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షాభావం వల్ల పంటలు సరిగా రాక రైతులు అవస్థలు పడుతున్నారు. రాత్రిపగలు పంటలను కాపాడుకునేందుకు పొలాల వద్దే ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
పగలు, రాత్రి పొలాల వద్దే రైతులు.. ఫ కేసీలో అడుగంటిన నీరు..
చాగలమర్రి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షాభావం వల్ల పంటలు సరిగా రాక అవస్థలు పడుతున్నారు. దీంతో రాత్రిపగలు పంటలను కాపాడుకునేందుకు పొలాల వద్దే ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
జొన్న వాడుముఖం..
రబీలో అధికంగా సాగుచేసే పంట జొన్న. సాదారణ సాగు 3వేల హాక్టార్లు విస్తీర్ణం హెక్లార్లు కాగా, ఈ ఏడాది 2వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున వర్షాలు ఉండవని అధికారులు చెప్పినా తమకు వ్యవసాయం తప్ప ఆధారం లేదని రైతులు జొన్న వేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి చినుకు జాడ లేదు, అడపా దడపా నీటి వసతి ఉన్నవాళ్లు అదనపు ఖర్చులు భరిస్తూ తడులు పెట్టుకుంటున్నారు.
కేసీ కాలువలో అడుగంటిన నీరు..
ప్రధాన సాగునీటి వనరు కేసీ కెనాల్‌లో నీరు లేదు. దీంతో రైతులు వ్యయ ప్రయాసలకోర్చి ఆయిల్ ఇంజన్లతో నీటిని మళ్లించుకుంటున్నా రు. ఇంత ఖర్చుచేసినా అరకొర నీరు మాత్రమే రావడంతో నిరాశకు గురవుతున్నారు.
ఎకరాకు రూ.20వేల పెట్టుబడి..
జొన్న సాగుకు విత్తనం దగ్గర నుంచి సేద్యం, ఎరువులతో కలిపి ఇప్పటి వరకు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. ఓ మోస్తరు వర్షాలు కూడా కురవకపోవడంతో పంటలు ఎండిపోతూ తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇటీవల తుఫాను ప్రభావం కూడా ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఇక పంటపై ఆశలు వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నీరు అందించి పంటలన కాపాడాలని కోరుతున్నారు.