Share News

చీకట్‌లు.. ఇక్కట్లు..

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:22 PM

చీకట్‌లు.. ఇక్కట్లు..

చీకట్‌లు.. ఇక్కట్లు..
హొళగుందలో విద్యుత్‌ కోతలకు నిరసనగా సబ్‌ స్టేషన్‌ ముట్టడించి.. అక్కడే మంటలు వేసిన ప్రజలు

పగటి ఉష్ణోగ్రతలు అధికం

రాత్రివేళ విద్యుత్‌ కోతలు

పల్లెల్లో 3-4 గంటలకు పైగా సరఫరా నిలిపివేత

ఉక్కపోతతో జనం విలవిల

ఆందోళనలకు దిగుతున్న ప్రజలు

సరఫరా తగ్గిందంటున్న అధికారులు

పల్లెసీమలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నారు. మరో వైప అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఎవరిది..? అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజు వారి కోటా 12 మిలియన్‌ యూనిట్లు (ఎంయూడీ) కాగా, 13.323 ఎంయూడీ సరఫరా చేస్తున్నారు. అయినా కూడా కోతలు అనివార్యమై ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

కర్నూలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. గృహ విద్యుత్‌ కనెక్షన్లు 6,66,543 వాణిజ్య కనెక్షన్లు సుమారు 82వేలు, పారిశ్రామిక కనెక్షన్లు 3వేలు, ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి సరఫరా తదితర కనెక్షన్లు 12,800, వ్యవసాయ కనెక్షన్లు 1.18 లక్షల వరకు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో సుమారు 8.81 లక్షల విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. జిల్లాకు రోజు వారి విద్యుత్‌ వినియోగం కోటా 12 మిలియన్‌ యూనిట్లు (ఎంయూడీ) కాగా, వినియోగం పెరగడంతో ప్రస్తుతం 13.32-14 మిలియన్‌ యూనిట్లకు పైగా సరఫరా చేస్తున్నారు. వర్షాలు లేకపోవడం, సోలార్‌, విండ్‌ పవర్‌ పైన మాత్రమే ఆధార పడటంతో రాత్రిపూట వినియోగానికి సరఫరాకు మధ్య తేడా వస్తోంది. సరఫరాకు.. వినియోగం మధ్య ఇబ్బంది లేకుండా పలు ఫీడర్ల పరిధిలో కోతలు పెట్టాల్సి వస్తోందని విద్యుత్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో రాత్రి 7 నుంచి 12 గంటల మధ్య దాదాపు 2-3 గంటలు సరఫరా నిలిచిపోతోంది. కొన్ని గ్రామాల్లో నాలుగు గంటలకు పైగా కరెంటు తీస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఫ్యాన్లు తిరగక, ఇళ్లలో ఉక్కపోత పెరిగిపోతోంది. విద్యుత్‌పై ఆధారపడి తాగునీటి సరఫరా, చిన్న వ్యాపారాలు, పాడి పరిశ్రమ, ఇతర గ్రామీణ కార్యకలాపాలపైన ప్రభావం పడుతోందని వాపోతున్నారు.

సబ్‌ స్టేషన్లు ముట్టడి.. రోడ్డెక్కిన అన్నదాతలు

కోతలు భరించలేక పశ్చిమ పల్లెల్లో ప్రజలు, రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. హోళగుంద మండల కేంద్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా రెండు రోజుల క్రితం ప్రజలు ఏకంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. అధికారులు స్పందించాలంటూ.. వారిని లోపలికి వెళ్లకుండా ముళ్లకంపలు అడ్డంగా వేశారు. రహదారిపై మంటలు వేసి నిరసన తెలిపారు. ఆలూరు మండలం హోళేబీడులోనూ విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ప్రజలు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేయగా.. ప్రజలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్పరి, దేవనకొండ మండలాల్లోనూ కోతలకు నిరసనగా ప్రజలు రోడ్డెక్కారు. ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఏ గ్రామంలో ప్రజలను కదిపినా రాత్రిపూట విద్యుత్‌ కోతలతో పడుతున్న ఇబ్బందులపై ఏకరువు పెడుతున్నారు.

విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలేవి?

ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు లేక వేసవి కాలాన్ని తలపిస్తుంది. ఖరీప్‌ సీజన్‌లో బోరుబావుల కింద 50-60 శాతం వర్షం పైనే ఆధారపడితే.. 40 శాతం పంటలకు తడులు పెట్టేందుకు విద్యుత్‌ బోరుబావులపై ఆధారపడేవారు. ప్రస్తుతం వానలు పడకపోవడంతో పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడాల్సి రావడంతో వినియోగం భారీగా పెరిగింది. అదే క్రమంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల రాత్రి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో గృహ విద్యుత్‌ వాడకం డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. రాత్రివేళ గంటల తరబడి విద్యుత్‌ లేకపోవడం గ్రామీణ ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు రైతులు సబ్‌ స్టేషన్లును ముట్టడించే పరిస్థితి. మరోవైపు ప్రజలు రహదారులపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. సమస్య మరింత తీవ్రమై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగకముందే పాలకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామీణ ప్రాంతాలకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేలా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో ఇది పరిస్థితి:

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లు : 8.81 లక్షలు

గృహ వినియోగ కనెక్షన్లు : 6,66,543

వాణిజ్య కనెక్షన్లు : 82వేలు

పారిశ్రామిక కనెక్షన్లు: 3వేలు

ప్రభుత్వ ఆఫీసులు, వాటర్‌ వర్క్స్‌ : 12,800

వ్యవసాయ కనెక్షన్లు: 1.18 లక్షలు

రోజువారి విద్యుత్‌ కోటా: 12.9 మిలియన్‌ యూనిట్లు

ప్రస్తుత వినియోగం : 13,323-14 మిలియన్‌ యూనిట్లు

గ్రామాల్లో రాత్రి కోతలు : 2-4 గంటలు

ప్రస్తుతం కోతలు లేవు

వర్షాలు లేకపోవడం, జల, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల సోలార్‌, విండ్‌ విద్యుత్‌ పైన ఆధారపడాల్సి వచ్చింది. రెండు మూడు రోజులుగా డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌సరఫరా లేకపోవడం వల్ల రెం డు మూడు రోజులు తప్పని పరిస్థితుల్లో కోతలు అనివార్యం అయ్యాయి. శుక్రవారం నుంచి విద్యుత్‌ సరఫరా మెరుగు పడటంతో జిల్లాలో ఎక్కడా కోతలు విధించలేదు. జిల్లా విద్యుత్‌ కోటా 12 మిలియన్‌ యూనిట్లు కాగా ప్రస్తుతం 13.323 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నాం.

- సురేష్‌ కుమార్‌, టెక్నికల్‌ ఈఈ, విద్యుత్‌ శాఖ, కర్నూలు

చీకటిలో మగ్గిపోతున్నాం

పొలాల్లో పగలంతా కష్టపడి కూలీ పనులు చేసుకుని పొద్దుపోయాక ఇంటికి వస్తున్నాం. ఆ సమయానికి ఇంట్లో కరెంటు ఉండటం లేదు. కరెంటు లేక, నానా ఇబ్బందులు పడుతున్నాం. గంటల కొద్ది కరెంటు తీయడంతో గుడిసెల్లో పిల్లలు నిద్రపోవడం లేదు. బయట పడకుందాం అంటే దోమల బెడద అధికంగా ఉంది. కరెంటు బిల్లు ఒక్కరోజు ఆలస్యమైతే రూ.100 ఫెనాల్టీ వేస్తున్నారు. కరెంటు మాత్రం ఇష్టానుసారంగా తీస్తున్నారు. చీకటిలోనే మగ్గిపోతున్నాం.

- తాయమ్మ, బీసీ కాలనీ, హొళగుంద

విద్యుత్‌ కోతలతో ఆదాయం కోల్పోతున్నా

వేళాపాళా లేని విద్యుత్‌ కోతల వల్ల రోజువారి ఆదాయం కోల్పోతున్నాం. మెకానిక్‌ షాపు ద్వారా రోజుకు రూ.1000 వచ్చేది విద్యుత్‌ కోతల వల్ల వెల్డింగ్‌ పని నిలిచిపోతుంది. రోజుకు రూ.500 కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతోంది.

- నరసింహులు, మెకానిక్‌, ఆలూరు

పరిశ్రమలపై కోతలు విధించలేదు

విద్యుత్‌ కోతలు తమ పరిశ్రమలపై ఇంకా విధించలేదు. విద్యుత్‌ ఉత్సత్తి తగ్గిపోవడం వల్ల కోతలు విధించే అవకాశాలు ఉన్నాయని, సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు మాత్రం సర్క్యులర్‌ అందించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జలాశయాల్లో నీరు లేకపోవడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సోలార్‌ విద్యుత్‌ కూడా గృహ ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. విద్యుత్‌ కోతలు విధిస్తే తాము ఎం చేయలేము. ఉత్పత్తి తక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమ యజమానులు కూడా విద్యుత్‌ కోతలు భరించాల్సిందే. ఎన్ని గంటలు కోతలు విధిస్తారన్న విషయం తమకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో పత్తి జిన్నింగ్‌ ఉత్పత్తిని చేసుకుంటాము.

వెంకటరామిరెడ్డి, ధారా శ్రీ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ పరిశ్రమ, ఆదోని

Updated Date - Sep 12 , 2026 | 11:22 PM