ప్రమాదకరంగా వంక
ABN , Publish Date - May 04 , 2026 | 12:12 AM
: మండలంలోని అలువాల గ్రామంలో ఉన్న వంక ప్రమా దకరంగా మారింది. ముళ్ల పొదలు, చెత్తచెదారంతో నిండిపోవడం కారణంగా మురుగు నీరు కూడా ముందుకు సాగడం లేదు.
ముళ్లపొదలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి
దుర్గంధం వెదజల్లుతున్న వైనం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వంక నుంచి గ్రామంలోకి చేరుతున్న విష సర్పాలు
గోనెగండ్ల, మే 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని అలువాల గ్రామంలో ఉన్న వంక ప్రమా దకరంగా మారింది. ముళ్ల పొదలు, చెత్తచెదారంతో నిండిపోవడం కారణంగా మురుగు నీరు కూడా ముందుకు సాగడం లేదు. వంక దుర్గంధం వెదజల్లుతోంది. అలువాల గ్రా మంలో 6500 జనాభా ఉంది. గ్రామానికి ఆనుకొని వంక ఉండటంతో చుట్టు పక్కల ఇళ్లవారు దుర్గంధం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని చెత్త చెదారంను ఈ వంకలోనే పారవేస్తున్నారు. వంకలో దుర్గంధం తో కూడిన మురుగునీరు ఉండటంతో అక్కడ విషపూరిత మైన పాములు సంచరించడమే గాక చుట్టు పక్కన ఉన్న గృహాలలోకి వెళ్తూ ప్రజలను భయబ్రాతులకు గురిచేస్తున్నాయి. ఈ వంకకు పైనున్న గ్రా మాలైన కులుమాల, చిన్నమరివీడు గ్రామాల నుంచి వర్షాకాలంలో వరద అలువాల మీదుగా కంపాడుకు చేరి అక్కడి నుంచి గురుజాల, రాయచోటి గ్రామాల మద్య తుంగ భద్రా నదిలో వంక నీరు కలుస్తాయి. అలువాల దగ్గర వంకపై గతంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలోపై గ్రామాల నుంచి వచ్చే వరద బ్రిడ్జి నుంచి ముందుకు సాగే పరిస్థ్థితి లేదు. వంక మొత్తం ముళ్లపొదలు, చెత్తతో నిండిపోయింది. చిన్నపాటి వర్షం వచ్చినప్పటికి వంకలో నీరు పోవడానికి లేక పోవడంతో బ్రిడ్జిపై నుంచి నీరు వెళ్లాల్సి వస్తుంది. దీంతో అలువాల గ్రామాల మీదుగా పెద్దనేలటూరు, కులుమాల, దైవందిన్నె, పొణకలదిన్నె, పెసలదిన్నె, ఏనుగుబాల గ్రామాల రాక పోకలు నిలిచిపోతాయి.
ఏడేళ్ల క్రితం ఐదుగురు..
ఏడేళ్ల క్రితం కూడా అలువాల దగ్గర వంక ముళ్లపొదలతో నిండిపోయింది. అప్పట్లో భారీ వర్షం కురియడంతో వంకపై నుంచి కులుమాల, చిన్నమరివీడు గ్రామాల నుంచి వరద రావడం, అలువాల దగ్గర వంకలో వరద వెళ్లేందుకు బ్రిడ్జి మార్గం మొత్తం ముళ్ల పొదలు నిండిపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. అలువాల గ్రామంలోకి వరద నీరు చేరింది. ఈ ప్రమాదాన్ని గమనించకుండా బ్రిడ్జి దాటేందుకు వచ్చిన ఐదుగురు వరదకు కొట్టుకుపోయి మృతిచెందిన సంఘటన జరిగింది. కావున ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు ముళ్ల పొదలను తొలగించి చెత్తచెదారంను శుభ్రం చేయాలని ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్థులు కోరుతున్నారు.