దళిత ద్రోహి జగన్
ABN , Publish Date - May 19 , 2026 | 11:26 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం పాలైందని, అదే సమయంలో దళిత ద్రోహిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో రాష్ట్రం విధ్వంసం
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
కర్నూలు అర్బన్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం పాలైందని, అదే సమయంలో దళిత ద్రోహిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మనోవేదనకు గురయ్యారన్నారు. 2019-2024 మద్యకాలంలో పాలన కొనసాగించిన సమయంలో ఎంతో మంది దళిత, సామాజిక వర్గాల వారిని హింసించారన్నారు. మాస్క్‌లు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను చిత్రహింసలకు గురి చేసి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్‌ను సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.27 వేల కోట్లు, ఎస్టీలకు రూ.5 వేల కోట్లు మొత్తం రూ.33 వేల కోట్లు జగన్ హయాంలో పక్కదారి పట్టాయన్నారు. ఆ నిధులను వైసీపీ నాయకులు పథకాల పేరిట కాజేశారన్నారు. గత వైసీపీ పాలనలో 56,981 మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. 200 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా రాష్ట్రంలో ఇంకా అలజడులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ కూటమి పాలనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అకెపోగు ప్రభాకర్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్, నాయకులు మందా అఖిల్, సత్రం రామకృష్ణ, వెంకటరాముడు, సుంకన్న, దశరథ నాయుడు తదితరులు పాల్గొన్నారు.