Share News

అడ్డంగా నరికేస్తున్నారు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:12 AM

మండలంలో పచ్చని చెట్లను అక్రమార్కులు అడ్డంగా నరికేసున్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులు, గ్రామాలు, పొలాల్లో ఉండే చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ తరలిస్తున్నారు.

అడ్డంగా నరికేస్తున్నారు!
ట్రాక్టర్‌లో తరలుతున్న కలప

ఆర్‌అండ్‌బీ రహదారులు, గ్రామాల్లో చెట్లను నరికేస్తున్న అక్రమార్కులు

చోద్యం చూస్తున్న అధికారులు

రుద్రవరం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో పచ్చని చెట్లను అక్రమార్కులు అడ్డంగా నరికేసున్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులు, గ్రామాలు, పొలాల్లో ఉండే చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ తరలిస్తున్నారు. ఒక మొక్క వృక్షంగా ఎదగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే నరికేందుకు పది నిమిషాలు చాలు..

రహదారుల పక్కన ఉండే చెట్లు..

అక్రమార్కులు మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల పక్కన నీడనిచ్చే చెట్లను వదలడం లేదు. పర్యావరణ ప్రేమికులు, అధికారులు నాటిన వృక్షాలను వీరు అడ్డంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువగా వేప, బసర, చింత, తుమ్మ తదితర వృక్షాలను నరికేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రహదారులు ప్రభుత్వ భూముల్లో పొలం గట్ల వెంట ఉన్న వృక్షాలు సైతం నేలకూలుస్తున్నారు.

వాల్టా చట్టానికి తూట్లు?

ఏపీ ప్రభుత్వం 2002లో నీరు. భూమి, చెట్లను రక్షించేందుకు చట్టం తీసుకువచ్చింది. నీటి సంరక్షణతో పాటు చెట్లను పెంచి భూగర్భజలాల వినియోగాన్ని నియంత్రించి పర్యావరణ పరిరక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం అనంతరం 2004లో వనరుల సంరక్షణ, భూమి చట్ట సంరక్షణ, భూగర్భ ఉపరితలనీటిని నియంత్రించేదుకు చట్టాన్ని అమలు చేసింది.

నరకాలంటే అనుమతి తీసుకోవలసిదే..

ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఒక చెట్టును నరకాలంటే రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ, ఫారెస్టుశాఖ అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. ఒక చెట్టు నరకకముందే మరో మొక్క నాటాలి. ఇది వాల్టా చట్టం ప్రత్యేకత. అయితే అక్రమార్కులకు ఇవేవీ పట్టడం లేదు.

రంపాలతో కోసి తరలింపు..

గతంలో భారీ వృక్షాలు నరికేందుకు చాలా సమయం పట్టేంది. అయితే ఎలెక్ర్టిక్‌ రంపం అందుబాటులో ఉండటంతో వీరి పని సులువైంది. రాత్రివేళ గంటల వ్యవధిలోనే వృక్షాలను నరికి మొద్దులుగా మార్చి తరలించేస్తున్నారు. మరికొన్ని చోట్ల పట్టపగలే నరికేస్తున్నా పట్టించుకునేవారు లేరు.

కళ్లు మూసుకున్న అధికారులు

రహదారుల వెంట, గ్రామాల్లో మొక్కలను నాటి, వాటిని రక్షించాల్సిన బాధ్యతరెవెన్యూ, ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్‌, అటవీ శాఖ అధికారులదే. అయితే మండలంలో వీరు పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే నరుక్కుంటూ పోతే భవిష్యత్‌ తరాలకు ఇది ఫలానా వృక్షం అని చూపించడానికి కూడా భవిష్యత్తులో వృక్షాలు కనిపించే అవకాశం ఉండదేమే..

వృక్షాలకు నెంబర్లు వేస్తాం..

పంచాయతీల పరిధిలో ఉన్న వృక్షాలకు నెంబర్లు వేసి రికార్డు చేసేలా ఆదేశాలు జారీ చేస్తాం. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వృక్షాలకు నరకకుండా చర్యలు తీసుకుంటాం. పచ్చదనాన్ని, పర్యావరణం కాపాడేందుకు కృషి చేస్తాం. - ఎంపీడీవో భాగ్యలక్ష్మి, రుద్రవరం

రహదారుల వెంట పరిశీలిస్తాం

ఆర్‌అండ్‌బి రహదారుల వెంట వృక్షాలు నరకకుండా చర్యలు తీసుకుంటాం. రహదారి పక్కన ఉండే చెట్లను గుర్తించి వాటికి రక్షణ కల్పిస్తాం. - వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌ఔబీ ఏఈ, ఆళ్లగడ్డ

అనుమతి లేకండా వృక్షాలు నరకడం నేరం

అనుమతి లేకుండా వృక్షాలు నరకడం చట్టరీత్యా నేరం, వృక్షాన్ని ఎందుకు నరుకుతున్నామో తెలుపుతూ అనుమతి తీసుకోవాలి. చెట్లను నరికేస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - థోనీ ఆల్‌ఫ్రెడ్‌, తహసీల్దార్‌

Updated Date - Feb 16 , 2026 | 12:12 AM