ఆధునికీకరిస్తేనే ఆయకట్టులో సాగు
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:06 PM
తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) పశ్చిమ ప్రాంతం పల్లెసీమల జీవనాడి. టీబీపీ బోర్డు పరిధిలో కాలువకు సీసీ లైనింగ్ పనులు చేశారు.
ఎల్లెల్సీకి రూ.382.49 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఇంజనీర్లు
ప్రభుత్వం నిధులిస్తేనే చివరి ఆయకట్టుకు సాగునీరు
తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) పశ్చిమ ప్రాంతం పల్లెసీమల జీవనాడి. టీబీపీ బోర్డు పరిధిలో కాలువకు సీసీ లైనింగ్ పనులు చేశారు. జిల్లా పరిధిలో ప్రధాన కాలువ సహా డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువలు దెబ్బతిన్నాయి. దీనివల్ల నీటి ప్రవాహ సామర్థ్యం కోల్పోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. 1,51,134 ఎకరాలకుగాను ఖరీఫ్‌లో, రబీలో 65-70 వేలకు కూడా సాగునీరు అందడం లేదు. కర్నూలు బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టుకు దశాబ్దాలుగా సాగునీరు అందకపోవడంతో వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. సీసీ లైనింగ్, ఆధునికీకరణ పనులు చేపడితే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రూ.382.49 కోట్లతో ఇంజనీర్లు పంపిన ప్రతిపాదన నివేదిక జలవనరుల శాఖకు ఈ నివేదిక చేరింది. నిధులిస్తేనే కరువు నేల పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఎల్లెల్సీ కింద ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు.. మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి 24 టీఎంసీలు నీటి వాటా ఉంది. నీటి సంవత్సరంలో డ్యాంలో చేరే వరదను లెక్కించి దామాషా ప్రకారం నీటి వాటా కేటాయిస్తారు. కర్ణాటక రాష్ట్రం హోస్పెట్ సమీపంలోని తుంగభద్ర డ్యాం పవర్ కెనాల్ 0/0 కి.మీల నుంచి 373.30 కిలో మీటర్లు ప్రవహించి.. కర్నూలు నగరంలో అంతర్భాగమైన కల్లూరు వద్ద ఉన్న సుద్దవాగు వరకు ప్రవహించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. 0/0 నుంచి 250.500 కిలోమీటర్ల వరకు తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలో ఉంది. ఆదోని మండలం ఆనవాలు దగ్గర 250.500 నుంచి 324 కిలో మీటర్లు వరకు అంటే కోడుమూరు వరకు 74 కిలో మీటర్లు ఎల్లెల్సీ, అక్కడి నుంచి కల్లూరు వరకు కర్నూలు బ్రాంచి కెనాల్ (కేబీసీ) 49.30 కిలో మీటర్లు ఉంది. టీబీపీ ఎల్లెల్సీ 74 కిలో మీటర్లు, కేబీసీ 49.30 కిలో మీటర్లు కలిపి 123.30 కిలో మీటర్లు ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, పంట కాలువలు జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఉంది. 250 కిలో మీటర్ల వద్ద ఏపీ వాటాగా 858 క్యూసెక్కులు నీరు ఇవ్వాల్సి ఉంది. ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువ దెబ్బతినడం, పూడికతో నిండిపోవడంతో 600-550 క్యూసెక్కులకు మించి ఇండెంట్ ఇవ్వడం లేదు. అందులో 300-450 క్యూసెక్కులు కూడా అందని దైన్యపరిస్థితి ఉంది.
ఆధునికీకరిస్తే చివరి ఆయకట్టుకు సాగు నీరు
టీబీపీ ఎల్లెల్సీ కాలువ 1955-57 మధ్యలో నిర్మించారు. 1993లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం తొలిసారిగా టీబీపీ ఎల్లెల్సీ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. అదే ఏడాది జూలై 13న జరిగిన ప్రత్యేక సలహా సంఘం సమావేశంలో ఎల్లెల్సీ సీసీ లైనింగ్‌కు సిఫార్సు చేసింది. పనులు మొదలవ్వగానే 1994లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. 1993-96 మధ్య ప్రధాన కాలువ కొంత వరకు లైనింగ్ పనులు జరిగాయి. మేజర్ డిస్ట్రిబ్యూటరీలు, డీపీలు, పంట కాలువలు లైనింగ్ చేయలేదు. ఆ తరువాత 2008 ఫిబ్రవరి 7న లైనింగ్ పనులకు రూ.179 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు.21 ఐ అండ్ సీఏడీ (మెజారిటీ-5) జారీ చేసింది. రూ.177.73కోట్లు ఖర్చు చేసి లైనింగ్ చేశారు. పలు చోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 13 ఏళ్లగా టీబీపీ ఎల్లెల్సీ, కేబీసీ ప్రధాన కాలువలు, మేజర్ డిస్ట్రిబ్యూటర్లు, డీపీలు, పంట కాలువలు ఆధునికీకరణ, సీసీ లైనింగ్ పనులు చేపట్టలేదు. ఎక్కడికక్కడే కాలువలు దెబ్బతినడంతో శివారు గ్రామాల ఆయకట్టుకు సాగు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. కాల్వల ఆఽధునికీకరణ పనుల కోసం రూ.382.49 కోట్ల నిధులు ఇవ్వాలని కోరుతూ జిల్లా జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు రావాలంటే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సహా ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడుపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టీబీపీ బోర్డు పరిధిలో లైనింగ్
తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు (టీబీపీ బోర్డు) పర్యవేక్షణలో ఉన్న 0/0 నుంచి 250.580 కిలోమీటర్ల వరకు దాదాపు రూ.800 కోట్లతో మూడేళ్ల క్రితమే సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. లైనింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 250.580 కిలో మీటరు నుంచి జిల్లాలో సీసీ లైనింగ్ చేస్తే కోడుమూరు, కర్నూలు మండలాల్లోని చివరి ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ విష యాన్ని జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా ఎల్లెల్సీ ఆధునికీకరణ కోసం రూ.382.49 కోట్లతో ప్రతిపాదనలు పంపినది వాస్తవమే అన్నారు.