శ్రీగిరిపై భక్తుల సందడి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:39 PM
మల్లన్నను దర్శించుకునేం దుకు వచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది.
శివ నామస్మరణతో మార్మోగిన పుర వీధులు
శ్రీశైలం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మల్లన్నను దర్శించుకునేం దుకు వచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. వారాంతపు సెలవులు కలసి రావడంతో గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు క్షేత్రానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున తలనీలాలు సమర్పించుకుని కృష్ణమ్మ ఒడిలో స్నానాలు చేసి నదిలో సారెలు సమర్పించుకున్నారు. స్వామి, అమ్మవార్ల వీఐపీ అలంకార దర్శనం టిక్కెట్టు పొందిన వారికి గంట, అతి శీఘ్ర దర్శనం వారికి రెండు గంటలు, శీఘ్ర, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు చెప్పారు. సామాన్య భక్తులకు క్యూలైన్‌లలో పాలు, మంచినీరు, అల్పాహారం, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. దర్శనానంతరం భక్తులకు పలు సాధకాలతో అన్నదాన భవనంలో భోజన ప్రసాద వితరణ చేశారు. అదే విధంగా రూ. 500, రూ. 300 టిక్కెట్లు పొందిన భక్తులు ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సుమారు 35 వేలమంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
భ్రమరాంబదేవికి పల్లకిసేవ...
సాయంత్రం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూ ర్తులను ఊరేగించారు.