Share News

ఎండుతున్న పంటలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:00 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భజలు అడుగంటి పంటలకు సాగునీరు అందడంలేదని రైతులు వాపోతున్నారు.

ఎండుతున్న పంటలు
నరసాపురంలో సాగు చేసిన పత్తి పంట

ఎల్‌నినో దెబ్బతో ఎండ, గాలి..

పంటలు దక్కవని రైతుల ఆందోళన

రుద్రవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భజలు అడుగంటి పంటలకు సాగునీరు అందడంలేదని రైతులు వాపోతున్నారు. ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్‌ డి విజనులో 29,011 వ్యవసాయ బోరుబావులున్నాయి. రుద్రవరంలో 8927, ఆళ్లగడ్డలో 6333, చాగలమర్రిలో 5688, గోస్పాడులో 1939, శిరివెళ్ల 4879, ఉయ్యాలవాడ 1245 వ్యవసాయ బోరుబావులున్నాయి. అరటి, వేరుశనగ, పత్తి, మినుము, పామాయిల్‌ తోటలు, మామిడి తోటలున్నాయి.

ఒక వైపు ఎండ.. మరో వైపు గాలి

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. అలాగే ఒక వైపు ఎండ మరో వైపు గాలి ఎక్కువగా వీస్తుండటంతో ఉన్న కాస్త నీటివనరులు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూమిలో తేమ శాతం తగ్గి పంటలకు నీరు అందడం లేదంటున్నారు.

సాగునీరందడంలేదు

మూడు ఎకరాల్లో మ్కొక్కజొన్న, మామిడి తోట సాగుచేశా. బోరులో నీరు తగ్గిపోయింది. గతంలో ఒక్కరోజులోనే నీరు పారించేవాడిని, వాతావరణ మార్పులతో ప్రస్తుతం మూడురోజులు అవుతోంది. - దుబ్బన్న, రైతు, రుద్రవరం

భూగర్భజలాలు తగ్గాయి

వర్షాలు కురవకపోవడంతో బోరుబావిలో భూగర్భజలాలు తగ్గాయి. దీనికితోడు ఎండ, గాలి ప్రభావంతో పంటలకు సాగునీరు అందించలేకపోతున్నా ఏ పంటలు సాగు చేయాలా అని ఆందోళన పడుతున్నా. - నాగిరెడ్డి. రైతు, డి.కొట్టాలు

Updated Date - Sep 13 , 2026 | 12:00 AM