Share News

ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:49 PM

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం పెరగడంతో పంటలకు తీవ్రనష్టం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వరలక్ష్మి అన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం
పంటలను పరిశీలిస్తున్న జేడీ వరలక్షి ్మ, కేవీకే శాస్త్రవేత్త

సమగ్ర పంట సంరక్షణ పద్ధతులు పాటించాలి

జిల్లా వ్యవసాయ శాఖాధికారి వరలక్ష్మి

గోనెగండ్ల, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎల్‌నినో ప్రభావం పెరగడంతో పంటలకు తీవ్రనష్టం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వరలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని హెచ్‌.కైరవాడి గ్రామంలో సాగుచేసిన పంటలను కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం) బనవాసి శాస్త్రవేత్త రాఘవేంద్రచౌదరి, ఏడీవో మహహ్మద్‌ ఖాద్రీతో కలిసి ఆమె పరిశీలించారు. వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా పత్తి పంటను రైతులు సాగు చేశారన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బెట్ట పరి స్థితుల కారణంగా పత్తిలో పచ్చ, తెల్లదోమ, పెనుబంక, తామర పురుగుల ఉధ్రుతి పెరిగిందన్నారు. వీటి నివారణకు ప్రతి ఎకరానికి 10 పసుపు రంగు జిగురు ట్రాప్‌లు , 10 నీలిరంగు జిగురు ట్రాప్‌లు పంటకంటే సుమారు ఒక అడుగు ఎత్తులో అమర్చాలన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మొక్కలోని తేమ వేగంగా ఆవిరైపోతుందన్నారు. ఈ కారణంగా మొక్క వాడిపోయి ఎదుగుదల నిలిచిపోతుందని తెలిపారు. రైతులు సమగ్ర పంట సంరక్షణ పద్ధతులను పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఏవో హేమలత, రైతులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:49 PM