Share News

నేర నియంత్రణే లక్ష్యం

ABN , Publish Date - May 30 , 2026 | 11:35 PM

నేర నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి పని చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

నేర నియంత్రణే లక్ష్యం

క్రికెట్‌ బెట్టింగ్‌పై నిఘా ఉంచాలి

జూన్‌ 1నుంచి ‘ఆపరేషన్‌ దండాయన్‌’ అమలు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, మే 30(ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి పని చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వ్యాస్‌ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకు గంజాయి అమ్మేవారిని, సేవిం చే వారిని గుర్తించేందుకు డ్రగ్స్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. జూన్‌ 1 నుంచి 30 వరకు ఆపరేషన్‌ దండాయన్‌ను అమలు చేయాలన్నారు. లైంగిక నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న సెక్సువల్‌ అఫెండర్లపై షీట్లు ఓపెన్‌ చేయాలని ఆదేశించారు. వారికి జియో ట్యాగింగ్‌ చేయాలని తెలిపారు. గత ఏడాది కాలంలో శిక్ష పడిన నేరస్థుల వివరాలు సేకరించి వారిపై నిఘా కొనసాగించాలన్నారు. 10 లక్షలకు పైగా జరిగిన సైబర్‌ మోసాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి వెంటనే దర్యాప్తులు చేపట్టాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడిన వారి నుంచి జరిమానాలు కోర్టుకు మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో లీగల్‌ అడ్వయిజర్‌ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్‌, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, బార్గవి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:35 PM