క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ABN , Publish Date - May 16 , 2026 | 12:20 AM
క్రికెట్ బెట్టింగ్ ముసుగులో మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగుతున్న ఓ అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠాను ఆదోని పోలీసులు గుర్తించారు.
ఆదోని పోలీసుల మెగా ఆపరేషన్
అదుపులో 9 మంది బుకీలు
రూ.6.72 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
ఆదోని, మే 15 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగ్ ముసుగులో మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగుతున్న ఓ అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠాను ఆదోని పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో పాటు గోవా వరకు విస్తరించిన ఈ హైటెక్ నెట్‌వర్క్‌ను టూటౌన్ పోలీసులు గుట్టురట్టు చేశారు. శుక్రవారం రాత్రి టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 18 రోజులపాటు దేశంలోని వివిధ నగరాల్లో నిఘా ఉంచి అత్యంత రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి 9 మంది అంతర్‌రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.72 లక్షల నగదు, 9 ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన 9 మంది నిందితులు వేర్వేరు రాష్ట్రాలు, ప్రధాన నగరాలకు చెందిన వారు కావడంతో వీరి లావాదేవీలు రూ.కోట్లలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, అలాగే బెట్టింగ్‌లకు ప్రధాన అడ్డాగా మారిన గోవా ప్రాంతానికి చెందిన కింగ్‌పిన్స్ ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నగరాలన్నింటినీ ఒకచైన్ లాగా లింక్ చేస్తూ ప్రత్యేక యాప్స్, ఫోన్ల ద్వారా నిందితులు రోజూ లక్షల రూపాయల బెట్టింగ్ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా వెనుక అంతర్రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద నెట్‌వర్క్ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. తమ స్పెషల్ టీం 18 రోజులపాటు గోవా, బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరు వంటి ప్రాంతాల్లో మకాం వేసి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితులపై టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బుకీల ఫోన్ డేటా, బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ లావాదేవీలు టెక్నికల్ టీం సాయంతో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకుంటున్నామన్నారు. త్వరలోనే మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్టయిన వారి పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది.