ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:20 AM
జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు, నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించే సిబ్బందికి నామినేషన్ల దాఖలు, స్వీకరణ, పరిశీలన ప్రక్రియలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర శిక్షణ అందించి ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు, నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు నిర్వహించే సిబ్బందికి నామినేషన్ల దాఖలు, స్వీకరణ, పరిశీలన ప్రక్రియలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర శిక్షణ అందించి ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. సోమవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి ఎన్నికల చట్టాలు, నిబంధనలు, స్టాట్యూటరీ ఫారాలు, సంబంధిత మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నామినేషన్లతో పాటు సమర్పించే అఫిడవిట్లలో అన్ని కాలమ్‌లను అభ్యర్థులు పూర్తిగా నింపేలా పరిశీలించాలన్నారు. అఫిడవిట్ల పరిశీలన సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తూ, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ టేబుళ్లు, సంబంధిత ఎన్నికల అధికారుల వివరాల్లో మార్పులు చోటుచేసుకుంటే వాటిని ఎప్పటికప్పుడు సరిచూసుకుని నవీకరించాలని స్పష్టం చేశారు.