పత్తి..దిగుమతి కత్తి..!
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:11 AM
పత్తి, దూది దిగుమతి సుంకం మినహాయింపు దేశీయ పత్తి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పోటీని తట్టుకోవడానికి భారత పత్తి సంస్థ (సీసీఐ) సైతం దూది బేలు ధరలు తగ్గించింది. దీంతో పత్తి ధరలు పతనం అవుతున్నాయి.
దూది దిగుమతి సుంకం మినహాయింపు
దేశీయ పత్తి, దూది అమ్మకాలపై తీవ్ర ప్రభావం
రూ.55,500 నుంచి రూ.53,500కు పడిపోయిన దూది కండి
చితికిపోతున్న రైతులు, వ్యాపారులు
పత్తి, దూది దిగుమతి సుంకం మినహాయింపు దేశీయ పత్తి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పోటీని తట్టుకోవడానికి భారత పత్తి సంస్థ (సీసీఐ) సైతం దూది బేలు ధరలు తగ్గించింది. దీంతో పత్తి ధరలు పతనం అవుతున్నాయి. రైతులు, వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. రెండు వారాల కిందట దూది కండి (356 కిలోలు) రూ.55-56 వేలు పలికేది. దిగుమతులు ప్రభావం కారణంగా దూది కండి రూ.53,500కు పడిపోయింది. ఫలితంగా ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గిపోయాయి. బుధవారం పత్తి ధరలు పరిశీలిస్తే క్వింటంపై రూ.వెయ్యికి పైగా పడిపోయాయి. ధరలు పెరుగుతాయనే ఆశతో ఇంట్లోనే పత్తి నిల్వ చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి జిన్నింగ్ చేసి దూది బేళ్లు అమ్మకాలకు సిద్ధం చేసిన వ్యాపారులు సైతం ఉహించని నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. విదేశీ పత్తి దిగుమతుల ప్రభావంతో చితికిపోతున్న పత్తి రైతుల కన్నీటి వ్యథలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 3.40 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. కర్నూలు జిల్లాలో ఒక్కటే 2.35 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. పత్తి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది 33 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటం పత్తి మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. అయితే.. పత్తి దిగుబడి చేతికొచ్చే సమయంలో పత్తి ధరలు పతనం అయ్యాయి. రాయలసీమలోనే అతి పెద్దదైన ఆదోని పత్తి మార్కెట్‌లో పోయిన అక్టోబరులో రూ.6,500 నుంచి రూ.7 వేలకు పడిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. ఆదోని పట్టణంలో 10, ఎమ్మిగనూరులో మూడు, మంత్రాలయంలో రెండు, నంద్యాలలో రెండు, గూడూరు మండలం పెంచికలపాడు వద్ద ఒకటి 2025 అక్టోబరు 30న సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి నాణ్యతను బట్టి క్వింటం రూ.7,800-8,110కు సేకరించారు. డిసెంబరు ఆఖరు వరకు ఉమ్మడి జిల్లాలో 7.50 లక్షల క్వింటాళ్లు సీసీఐ సేకరించింది. సీసీఐ రంగంలో దిగడంతో పత్తి వ్యాపారులు, కాటన్ జిన్నింగ్ యజమానులు సైతం నాణ్యతను బట్టి క్వింటం రూ.7,500 నుంచి రూ.8,500 వరకు కొనుగోలు చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులు, కాటన్ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు మరో పది లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటికీ రైతుల వద్ద దాదాపు 12-13 లక్షల క్వింటాళ్లు పత్తి నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
రైతులపై దిగుమతి పోటు
విదేశీ పత్తి దిగుమతులకు కేంద్రం తలుపులు తెరిచింది. అంతేకాదు.. అస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటే జీరో సుంకం, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పత్తికి 50 నుంచి 18 శాతానికి దిగుమతి సుంకం తగ్గించారని పత్తి వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభావం దేశీయ పత్తి వ్యాపారాలపై తీవ్రంగా ఉంది. . రెండు వారాల క్రితం ఆదోని మార్కెట్‌లో క్వింటం పత్తి గరిష్ఠంగా రూ.8,900 పలికింది. బుధవారం పత్తి ధరలు పరిశీలిస్తే కనిష్ఠంగా రూ.4,389, గరిష్ఠంగా రూ.7,980 పలికితే మధ్యస్థంగా రూ.7,679 పలికింది. అంటే.. విదేశీ పత్తి దిగుమతి ప్రభావం కారణంగా దేశీయ పత్తి ధరలపై పడింది. క్వింటంపై సరాసరి రూ.వెయ్యికి పైగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ రైతుల ఇళ్లలో 12-13 లక్షల క్వింటాళ్లు పత్తి నిల్వలు ఉన్నట్లు అంచనా. సాధారంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పత్తి ధరలు పెరుగుతాయని, క్వింటం రూ.10-15 వేలకు చేరుతుందనే ఆశతో పలువురు రైతులు సీసీఐ కేంద్రాల్లో అమ్మకాలు చేయకుండా నిల్వ చేశారు. తాజాగా ధరలు పతనం కావడంతో కష్టజీవులు కన్నీరు పెడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో అమ్మకాలు చేద్దామంటే గత నెలలోనే పత్తి సేకరణ ఆపేశారు.
వ్యాపారులపై తీవ్ర ప్రభావం
ఆదోని పట్టణంలో 35 కాటన్ జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. సీసీఐకి పోటీగా మద్దతు ధర, ఆపై ఎక్కువ ధరకు వ్యాపారులు పత్తి కొనుగోలు చేశారు. ఆదోనిలో జన్నింగ్ చేసిన పత్తి దూది బేళ్లను తమిళనాడులోని కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, దిండిగల్లు.. వంటి ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నూలు మిల్లులకు సరఫరా చేస్తారు. విదేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. విదేశీ పత్తి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరవడం, సుంకాలు భారీగా తగ్గించడం వల్ల నూలు మిల్లులు విదేశీ పత్తి దిగుమ తులపై ఆసక్తి చూపుతున్నారు. ఆ పోటీని తట్టుకోవడానికి భారత పత్తి సంస్థ (సీసీఐ) సేకరించిన పత్తి దూది బేళ్లను ఆన్‌లైన్‌లో అమ్మకాల కోసం ధరలు తగ్గించింది. దూది కండి (356 కిలోలు) వారం రోజుల క్రితం రూ.54,500కు అమ్మితే, తాజాగా రూ.53,500కు తగ్గించింది. ఒక్కో కండిపై రూ.వెయ్యి తగ్గించిందని పత్తి వ్యాపారులు తెలిపారు.ఆ ప్రభావం జిన్నింగ్ మిల్లులు, పత్తి వ్యాపారులపై పడింది.
సీసీఐ పోటీ తట్టుకోవడానికి క్వింటం రూ.7,900 నుంచి రూ.8,500కు పైగా కొనుగోలు చేశామని, జిన్నింగ్ చేసి అమ్మకాలు చేసే సమయంలో దూది ధరలు తగ్గిపోవడంతో రూ.లక్షలు నష్టపోతున్నామని, ఈ నష్టం నుంచి కోలుకోవడానికి మరో రెండేళ్లైనా పడుతుందని ఆదోనికి చెందిన పత్తి వ్యాపారి ఒకరు అన్నారు. మెజార్టీ పత్తి వ్యాపారులది ఇదే పరిస్థితి. దూది కండి ధర రూ.55-56 వేలు ఉంటేనే నష్టం లేకుండా కొంతైనా లాభం ఉంటుందని, ధరలు తగ్గిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోక తప్పదని అంటున్నారు.
విదేశీ దిగుమతులతో తీవ్ర నష్టం
విదేశీ పత్తి దిగుమతులకు కేంద్రం అనుమతులు ఇవ్వడమే కాకుండా సుంకాలు భారీగా తగ్గించింది. అస్ట్రేలియా నుంచి జీరో సుంకంతో పత్తి దిగుమతులు చేసుకోవచ్చు. అమెరికా దిగుమతులపై సుంకం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఈ పోటీని తట్టుకోవడానికి సీసీఐ కూడా దూది బేలు ధరను రూ.54,500 నుంచి రూ.53 వేలు, రూ.53,500కు తగ్గించింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో రెండు వారాల్లో దూది బేలు రూ.2,500లకు పైగా తగ్గింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- వెంకట్రామిరెడ్డి, పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, ఆదోని
పత్తి ధర పెరుగుతుందని ఆశించి నష్టపోయా
మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. సీసీఐ కేంద్రంలో అమ్ముదామంటే స్లాట్ బుక్ కాలేదు. ధరలు పెరుగుతాయనే ఆశతో ఇంట్లోనే నిల్వ చేశాను. ఆదోని మార్కెట్‌కు ఎనిమిది క్వింటాళ్లు పత్తి అమ్మకానికి తీసుకొచ్చాను. క్వింటం రూ.7,450కు విక్రయించాను. క్వింటానికి రూ.వెయ్యి ప్రకారం రూ.8 వేలు నష్టపోయాను.
- వీరేశ్, పత్తి రైతు, కోసిగి:
తీవ్ర నష్టం తప్పలేదు
ఐదు ఎకరాల్లో పత్తి సాగును చేశాను. అధిక వర్షాలకు దిగుబడి తగ్గింది. ధరలు పెరుగుతాయనే ఆశతో ఇంట్లోనే నిల్వ చేశాను. బుధవారం ఆదోని మార్కెట్‌కు ఆరు క్వింటాళ్లు పత్తి అమ్మకానికి తెస్తే క్వింటం రూ.7,200 పలికింది. ధరలు పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయాను.
- తిమ్మయ్య, పత్తి రైతు, కోసిగి