Share News

పాత ధరకే పత్తి విత్తనాలు

ABN , Publish Date - May 04 , 2026 | 10:45 PM

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట ఇచ్చింది.

పాత ధరకే పత్తి విత్తనాలు

450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ. 901

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఈ ఖరీఫ్‌కు అన్నదాతలకు తీపి కబురు

కర్నూలు అగ్రికల్చర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట ఇచ్చింది. ప్రతి ఏటా పత్తి విత్తన ఉత్పత్తి చేస్తున్న కంపెనీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పత్తి విత్తన ప్యాకెట్‌ ధరను పెంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే.. ఈసారి పత్తి విత్తన కంపెనీల ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదు. గత సంవత్సరం ఒక ప్యాకెట్‌ (450 గ్రాములు) పత్తి విత్తనాలను రూ.901గా నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా అధే ధరను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పత్తి రైతులు ఈసారి కూడా విత్తనాల ధరలు పెంచుతారేమోనని ఆందోళన చెందారు. అయితే. గతేడాది పత్తి విత్తనాల ధర ఎంత ఉందో అదే ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదేళ్ల నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పత్తి పంట సాగునే రైతులు ఎంచుకుంటున్నారు. గత సంవత్సరం ఖరీఫ్‌లో 6లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్న జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి జిల్లాకు 20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం

కర్నూలు జిల్లాలో 6 లక్షల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 70వేల ఎకరాల్లో మొత్తం 6.70 లక్షల ఎకరాల్లో రాబోయే ఖరీప్‌ సీజన్‌లో రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎకరా పత్తి పంట సాగు చేయాలంటే మూడు ప్యాకెట్ల విత్తనాలు అవసరం. ఆ లెక్కన 6.70 లక్షల ఎకరాలకు సుమారు 20లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ప్యాకెట్ల ధరను పెంచకపోవడం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులపై అదనపు భారం తగ్గినట్లే. ఆరేళ్లుగా ఏటా విత్తన కంపెనీలు పత్తి విత్తన ప్యాకెట్ల ధరను పెంచుకుంటూ పోతున్నాయి.

ఏటా పెంచిన ధరలు ఇలా..

ఏటా పత్తి విత్తన ప్యాకెట్‌ ధరలు పెరిగిన తీరును చూస్తే కంపెనీలు ఏ విధంగా రైతులను విత్తనాల అమ్మకం రూపంలో దగా చేస్తున్నాయో అర్థమవుతుంది. 2020-21లో ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.730 ఉండగా.. 2021-22లో రూ.765కు పెంచారు. 2022-23లో రూ.810కు పెంచాయి. 2023-24లో రూ.853, 2024-25లో రూ.864కు పెంచారు. 2025-26లో ఏకంగా రూ.901కు పెంచారు. ఈసారి పత్తి విత్తనాల ధరలను ఏ మాత్రం పెంచబోమని, ఇప్పటికే రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారని, కాదు కూడదని పత్తి విత్తనాల ప్యాకెట్లను పెంచితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని రైతు సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తి విత్తన ధరలు పెంచకుండా పాతధరలనే ఖరారు చేస్తూ నిర్ణయ తీసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా రైతులు పత్తి పంట తప్ప తమకు ఏ పంట కలిసి రావడం లేదని నమ్మకంతో ఉన్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల పత్తి పంట ఆశించినంతగా చేతికందడం లేదు. మరో వైపు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రైతులకు పత్తి చేతికందగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రకటించిన క్వింటానికి రూ.8,011 అందించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. తెగుళ్లు, తదితర కారణాల వల్ల దిగుబడి తగ్గిపోతూ వస్తుంది. గతంలో ఎకరాకు 11 క్వింటాళ్ల దిగుబడి రాగా, గత సంవత్సరం ఎకరాకు కేవలం 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రైతులకు అందింది. అయితే.. కేంద్రం మద్దతు ధరను క్వింటానికి రూ.8,011లు అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో పత్తి రైతులు ఆ పంటను సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సీసీఐ రైతుల నుంచి 7,39,807 క్వింటాళ్లను కొనుగోలు చేసి రూ.579.66 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లోనే క్వింటం పత్తికి గరిష్ఠంగా రూ.9,615లు, మధ్యస్థ ధర రూ.9,300లు వ్యాపారులు అందిస్తుండటంతో రైతులు పత్తి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు.

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

కేంద్ర ప్రభుత్వం ప్యాకెట్‌ పత్తి విత్తనాల ధరను రూ.901లుగా నిర్ణయించింది. ఈ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఎవరైనా డీలర్లు ఎక్కువ డిమాండ్‌ చేస్తే రైతులు ఫిర్యాదు చేయాలి. దుకాణాల వద్ద విత్తనాల ధరను డీలర్లు తప్పనిసరిగా పట్టిక రూపంలో రైతులందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ

Updated Date - May 04 , 2026 | 10:45 PM