పత్తి పంట దున్నివేత
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:52 PM
పతి రైతులకు ఈఏడాది అప్పులే మిగిలాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక మొలక దశ నుంచే మొక్కలు ఎండిపోయాయి. అప్పుడప్పుడూ అరకొరగా కురిసిన వర్షానికి పంట పెరగక మధ్య దశలోనే పూత, పిందె, కాయ వచ్చి పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నష్టం
మూగజీవాలకు వదిలేసిన పత్తిపంట
మంత్రాలయం, నవంబర్ 12(ఆంధ్రజ్యోతి): పతి రైతులకు ఈఏడాది అప్పులే మిగిలాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక మొలక దశ నుంచే మొక్కలు ఎండిపోయాయి. అప్పుడప్పుడూ అరకొరగా కురిసిన వర్షానికి పంట పెరగక మధ్య దశలోనే పూత, పిందె, కాయ వచ్చి పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. బోర్లు, నదితీరం, బావుల కింద సాగుచేసిన పత్తిపంటను గులాబిరంగు పురుగుసోకి పంటనంతటిని నమిలేసింది. మొగ్గ, పూత, పిందె, కాయ రాలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్ని మందులు వాడినా అదుపుకాకపోవడంతో మూగ జీవాలకు పత్తిపంటను గ్రాసానికి వదిలేశారు. మంత్రాలయం మండలంలోని చెట్నహల్లి, సూగూరు, మాధవరం, వగరూరు, తిమ్మాపురం తదితరు గ్రామాలకు చెందిన రైతులు సాగుచేసిన పత్తిపంటను పశువులకు మేతగా వదిలేశారు. రైతులు వందల ఎకరాల్లోని పంటలను దున్నేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి సాగుచేస్తే పెట్టుబడి సైతం రాలేదని వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొంతమంది రైతులు పంటను పీకేశారు. కొందరు దున్నేశారు. మరి కొందరు మూగజీవాలకు మేతగా వదిలేశారు.
ఈ ఏడాది అప్పులే మిగిలాయి
మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగుచేస్తే అప్పులే మిగిలాయి. మూడు ఎకరాలకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చుచేస్తే రూ.1.60 లక్షల పంట వచ్చింది. ఏడాదంతా తాము చేసిన కష్టమంతా వృథా అయింది. - రామలింగ, కౌలు రైతు, చెట్నహళ్ళి గ్రామం