ఎస్‌ఎస్‌ఏలో అవినీతి చేప
ABN , Publish Date - May 30 , 2026 | 11:40 PM
ఎస్‌ఎస్‌ఏలో అవినీతి చేప
రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ రమేష్
నందికొట్కూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లో అవినీతి చేప ఏసీబీ గాలానికి చిక్కింది. కస్తూర్బా పాఠశాలల్లో జరుగుతున్న నూతన నిర్మాణాలకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కోసం కాంట్రాక్టర్ నుంచి ఎస్‌ఎస్‌ఏ ఏఈగా విధులు నిర్వహిస్తున్న రమేష్ రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జూపాడు బంగ్లా, మిడ్తూరు మండ లాలకు క్వాలిటీ కంట్రోల్ ఇన్‌చార్జి ఏఈగా రమేష్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయా పాఠశాలల్లో పలు రకాల పనులను కాంట్రాక్టర్ శ్రీరాములు చేస్తున్నారు. జూపాడు బంగ్లాలోని పాఠశాలలో లైబ్రరీ, కంప్యూటర్ గదులను రూ.42లక్షలతో, మిడ్తూరులో రూ.17 లక్షల విలువ చేస్తే పనులను చేస్తున్నారు. వీటి క్వాలిటీ సరిగా లేదంటూ, రివైజ్ ఎస్టిమేషన్ వేయాలం టూ, ఎంబుక్ తయారు చేయించాలంటూ ఇలా ప్రతిసారి ఏఈ రమేష్ డబ్బులను అడిగేవాడు. పని ప్రారంభానికి ముందు ఒప్పుకున్న ధర ఒకటి ఆ తర్వాత పని పూర్తి అయ్యాక ఇంతే డబ్బులు వస్తాయని చెబు తూ తనను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ఏఈ గురించి కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. శనివారం ఏఈ కారులో కాం ట్రాక్టర్ శ్రీరాములు, ఏఈ రమేష్ ఇద్దరు కర్నూలు నుంచి బయలుదేరి జాతీయ రహదారి 340 సి బ్రాహ్మణకొట్కూరు సమీపంలోని సింహాద్రి కోల్డ్ స్టోరేజ్ వద్ద సర్వీస్ రోడ్డులో కారును నిలిపారు. శ్రీరాములు నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ సోమన్న తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.