కట్టెల పొయ్యి మీదే వంటలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:24 AM
మధ్యాహ్న భోజన పథకంలో గ్యాస్ మీదే వంటలు చేయాలని ఆదేశాలున్నాయి. వీటికి తిలోదకాలు ఇచ్చి ‘మధ్యాహ్నం’ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ‘మధ్యాహ్నం’ నిర్వాహకులు
నాలుగు నెలలుగా అందని బిల్లులు
అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు
మంత్రాలయం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంలో గ్యాస్ మీదే వంటలు చేయాలని ఆదేశాలున్నాయి. వీటికి తిలోదకాలు ఇచ్చి ‘మధ్యాహ్నం’ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. మంత్రాలయం మండలంలో పలు పాఠశాలల్లో ఇదే తంతు కొనసాగుతోంది. నాణ్యత, పరిమాణం, మెనూ చూడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టమైన రీతిలో భోజన నిర్వాహకులు చేసిన వంటలనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఈ భోజనం తినలేక చాలామంది విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ఇంటి నుంచి క్యారెర్లు తెచ్చుకుంటున్నారు. పలువురు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
పాఠశాలలు తెరిచినప్పటి నుంచి..
పాఠశాల తెరిచినప్పటినుంచి దాదాపు 4నెలలుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో వారు ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహ రిస్తున్నారు. గ్యాసుతోనే వంటలు చేయాలని ఆదేశాలున్నా కట్టెలనే వినియోగిస్తున్నారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పొగతో ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు రుచికరమైన భోజనం లేక
మండలంలో 11 జడ్పీహెచ్‌ఎ్‌స, 5 ప్రాథమికోన్నత, 31 ప్రాథమిక, ఏపీ మోడల్ స్కూల్లో 10,285 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి సరైన, రుచికరమైన భోజనం లేక పోవడంతో చాలామంది విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. తుంగభద్ర, కాచాపురం పాఠశాలల్లో వృద్ధులు భోజనం వండుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భోజన నిర్వాహకులకు బిల్లులు మంజూరుచేసి కట్టెల పొయ్యిలను తొలగించి గ్యాస్‌తో వండే విధంగా, నాణ్యత, ప్రమాణాలు, మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
బిల్లులు రాకపోవడంతోనే గట్టిగా..
మండలంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా జరగడం లేదని తమ విచారణలో తెలిసినా గట్టిగా ఆదేశించలేకపోతున్నాం. జూన్ నెలలో 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రమే భోజనం బిల్లులు మంజూర య్యాయి. 1-8 తరగతులకు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా రాకపోవడంతో నిర్వాహకులు మానేస్తామని చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అప్పులు చేసి తప్పని పరిస్థితుల్లో నాణ్యత ప్రమాణాలు మెనూలు పాటిస్తూ రుచికరమైన భోజనం వడ్డిస్తున్నాం. రాగన్న, ఎంఈవో-2, మంత్రాలయం