Share News

గోడ నిర్మాణం విషయంలో గొడవ

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:52 PM

గోడ నిర్మాణం, మిద్దెపై నుంచి వర్షపు నీరు పారే విషయంలో ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ ఘటన మండలంలోని ప్యాలకుర్తిలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 గోడ నిర్మాణం విషయంలో గొడవ
కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో ఇరు వర్గాలతో మాట్లాడుతున్న పోలీసులు

కోడుమూరు రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గోడ నిర్మాణం, మిద్దెపై నుంచి వర్షపు నీరు పారే విషయంలో ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ ఘటన మండలంలోని ప్యాలకుర్తిలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య గోడ నిర్మాణం, మిద్దెపై నుంచి వర్షపునీరు పారే విషయంలో మాటామాట పెరిగింది. వివాదం చిలికిచిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు రాళ్లు, ఇటుకలతో దాడులకు పాల్పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఓ వర్గం వారు ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్న సమయంలో అవతలి వర్గం వారు ఇంటిపైకి రాళ్లు విసరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గీయులను చెదరగొట్టారు. రాయి తగిలి ఓ పోలీసు చేతి వేలికి గాయమైనట్లు తెలిసింది. పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన గ్రామంలో ఘర్షణ తలెత్తడంపై చర్చనీయాంశమైంది.

వ్యక్తిపై గొడ్డలితో దాడి

హొళగుంద, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మండలంలోని నెరణికితండాలో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ తెలిపారు. వివరాలు.. రాఘవేంద్ర నాయక్‌ అనే యువకుడి తల్లి హేమ్లాబాయితో, రామునాయక్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. రాఘవేంద్ర నాయక్‌ సోమవారం రాత్రి రామునా యక్‌ హేమ్లాబాయితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఒక్కసారిగా అతడు గొడ్డలితో దాడి చేశాడు. రామునాయక్‌కు మోచేతికి, భుజం, మరికొన్నిచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన యువకుడు పరారయ్యాడు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగ్రాతుడిని కుటుంబ సభ్యులు నిమిత్తం ఆదోనిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురికి కత్తిపోట్లు

బనగానపల్లె, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని యర్రగుడి గ్రామంలో గ్రామంలోని ఆలయాలకు తప్పెట్లు కొట్టే మేటీల విషయమై జరిగిన ఘర్షణలో ముగ్గురు మంగళవారం కత్తిపోట్లకు గురయ్యారు. వివరాల మేరకు.. గ్రామంలో ప్రతి ఏడాది ఒకరి తర్వాత మరొకరు తప్పెట్లు కొట్టడం ఆనవాయితీ. ఈక్రమంలో మేటీల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఇందులో నాగతిమ్మయ్య పెద్దజమ్ములయ్య వర్గాల మధ్య వివాదం తలెత్తి పెద్దజమ్ములయ్య, బాలాజీ, నాగమద్దయ్య కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడ్డ నాగతిమ్మయ్యను, ప్రత్యర్థి వర్గానికి చెందిన పెద్దజమ్ములయ్య, బాలాజీ, నాగమద్దయ్యను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం నంద్యాల, కర్నూలు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ కల్పన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘర్షణలో ఇద్దరికి గాయాలు

నందికొట్కూరు రూరల్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పాత కక్షలతో రెండు కుటుంబాల మధ్యగొడవ జరిగి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బిజినవేముల గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... గ్రామానికి చెందిన మల్లయ్య, శంకర్‌ కుటుంబాల వారు అలాగే సుధాకర్‌, బాలక్రిష్ణ కుటంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. రెండు కుటుంబాల వారు కర్రలు, రాడ్లతో కొటుకున్నారు. వీరిలో సుధాకర్‌, బాలకృష్ణకు తీవ్రంగా గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య, రవికుమార్‌, రాజా,శంకర్‌పై నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Mar 31 , 2026 | 11:52 PM