Share News

డ్రగ్స్‌ నిర్మూలనకు సహకరించండి

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:32 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు.

డ్రగ్స్‌ నిర్మూలనకు సహకరించండి
‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆకే రవికృష్ణ

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపు

కర్నూలు క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యమన్నారు. శనివారం కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’పై అవ గాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. దేశ భద్రత గురించి, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్‌ ముట్టుకోకూ డదని అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌లో భాగంగా విద్యాసంస్థలు, పాఠశాలల పరిసర ప్రాంతాల్లో పొగాకు రహిత ప్రాంతాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల, తదితర ప్రాంతాల్లో గంజాయి సాగు, డ్రగ్స్‌ అక్రమ రవాణా విక్రయాలు, వినియోగం, గురించి తెలిస్తే ఆ సమాచారాన్ని ఈగల్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1972కు అందించాలని కోరారు. అనంతరం ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే పేరుతో పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్‌ హుస్సేన్‌ పీరా, జిల్లా ఎక్సైజ్‌ అధికారి సుధీర్‌బాబు, డ్రగ్స్‌ ఏడీ హరిహరతేజ, పుల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపల్‌ వీరభద్ర రెడ్డి, కళాశాల హెచ్‌వోడీ డీన్‌ దేవకి, తాలుకా సీఐ తేజోమూర్తి, ఈగల్‌ టీమ్‌ పోలీసు అధికారులు, సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ సుజన్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 11:32 PM