Share News

కార్మికులపై కాంట్రాక్టు సంస్థల ఉక్కుపాదం..

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:23 AM

పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు దూరం నుండి కడుపు చేత పట్టుకొని వచ్చిన కార్మికులపై అలా్ట్రటెక్‌ పరిశ్రమలోని కాంట్రాక్టు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మండల పరిధిలోని నూతన అలా్ట్రటెక్‌ పరిశ్రమలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తలు కొనసాగాయి.

కార్మికులపై కాంట్రాక్టు సంస్థల ఉక్కుపాదం..
కార్మికులతో చర్చిస్తున్న పోలీసు అధికారులు

అలా్ట్రటెక్‌లో ఆగని ఉద్రిక్తతలు ..

కన్నెత్తి చూడని అధికారులు

పోలీసులతో కార్మికుల నోళ్లు నొక్కుతున్న వైనం

పరిస్థితిని సమీక్షించిన ఏఎస్పీ మందా జావలి

కొలిమిగుండ్ల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు దూరం నుండి కడుపు చేత పట్టుకొని వచ్చిన కార్మికులపై అలా్ట్రటెక్‌ పరిశ్రమలోని కాంట్రాక్టు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మండల పరిధిలోని నూతన అలా్ట్రటెక్‌ పరిశ్రమలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తలు కొనసాగాయి. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ వేలాది మంది కార్మికులు పనుల్లోకి వెళ్లకుండా నిరసనకు దిగారు. అయితే అలా్ట్రటెక్‌ యాజమాన్యం పోలీసులతో కార్మికుల నోళ్లు నొక్కుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలో శ్రమ దోపిడీ చేస్తున్నారని సుమారు 5 రాష్ట్రాలకు చెందిన 4వేల మంది కార్మికులు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పోలీసులతో తీవ్ర వత్తిడి తెచ్చి, ప్రశ్నించే వారిని పరిశ్రమ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. బుధవారం కూడా లేబర్‌ కాలనీ నుంచి, పరిశ్రమ వైపు కార్మికులు వెళ్లడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఏఎస్పీ మందా జావలి, కొలిమిగుండ్ల సీఐ రమే్‌షబాబుతో కలిసి అలా్ట్రటెక్‌ పరిశ్రమకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కార్మికులతో పోలీసులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కార్మికులు తెలిపారు. రోజుకు 12గంటలపాటు ఆదివారం సైతం పనులు చేయించుకొని 8గంటలకు ఇచ్చే వేతనాన్ని ఇవ్వడం దారుణమని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేస్తేనే నిరసనను విరమిస్తామని తెలిపారు.

కన్నెత్తి చూడని కార్మిక శాఖ

కొలిమిగుండ్ల మండలంలోని అలా్ట్రటెక్‌ పరిశ్రమలో మూడు రోజులుగా కార్మికుల నిరసనలు కొనసాగుతున్నా కార్మిక శాఖ మాత్రం కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి బతుకు దెరువు కోసం వలస వచ్చిన వేలాది మంది కార్మికులు అలా్ట్రటెక్‌ పరిశ్రమలో తమ కడుపు కొడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నా, ఘటనపై మీడియాలో దుమారం రేగుతున్నా కార్మిక శాఖ అధికారులు కనీసం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కార్మికుల నోళ్లు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:23 AM