Share News

రాయలసీమ లిఫ్టును కొనసాగించాలి

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:27 AM

: రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమ లిఫ్టును కొనసాగించాలి
మాట్లాడుతున్న కుంచం వెంకట సుబ్బారెడ్డి

రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకట సుబ్బారెడ్డి

కర్నూలు న్యూసిటీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం ఆయన నగరంలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజానీకాన్ని నిండా ముంచుతోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆ దిశగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేయాలన్నారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రజల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ ప్రకటన చేసి ఏపీ ముఖ్యమంత్రి పరువుతీశారన్నారు. ఈ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అధికార పార్టీలు కూడా దొందూ దొందే అన్న విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో సీమ ప్రజలకు జగన్‌ మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ బయట ఉంటూ ప్రగల్భాలు పలకడం కాదని అసెంబ్లీకి వెళ్లి గర్జించాలన్నారు. అలా అసెంబ్లీకి వెళ్లలేనప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవాలన్నారు. రాయలసీమ లిఫ్ట్‌పై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలకు కూటమి అధికారికంగా సమాధానం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే చెడు సంకేతాలు వెళ్తాయన్నారు. ప్రభుత్వం వైఖరిని బట్టి రాయలసీమ రాష్ట్ర సమితి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు సాదర్‌వలి, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎం.క్రిష్ణ, ఎర్రం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:27 AM