Share News

మెడికల్‌ సంస్థలకు వినియోగదారుల కమిషన్‌ వడ్డింపు

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:16 AM

నరాల వ్యాధితో బాధపడుతున్న 3 సంవత్సరాల బాలుడికి చికిత్స మధ్యలో నిలిపివేసి సేవాలోపం చేసిన నాలుగు మెడికల్‌ సంస్థలకు కర్నూలు జిల్లా వినియోగదారలు కమిషన్‌ తగిన రీతిలో వడ్డించింది. స్థానిక జొహరాపురం చెందిన ఫిర్యాది మైనర్‌ అయిన సయ్యద్‌ హసన్‌ బాషా నరాల వ్యాధితో బాధపడేవాడు.

మెడికల్‌ సంస్థలకు వినియోగదారుల కమిషన్‌ వడ్డింపు

కర్నూలు లీగల్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నరాల వ్యాధితో బాధపడుతున్న 3 సంవత్సరాల బాలుడికి చికిత్స మధ్యలో నిలిపివేసి సేవాలోపం చేసిన నాలుగు మెడికల్‌ సంస్థలకు కర్నూలు జిల్లా వినియోగదారలు కమిషన్‌ తగిన రీతిలో వడ్డించింది. స్థానిక జొహరాపురం చెందిన ఫిర్యాది మైనర్‌ అయిన సయ్యద్‌ హసన్‌ బాషా నరాల వ్యాధితో బాధపడేవాడు. దీంతో అతని సంరక్షకుడైన సయ్యద్‌ హుశేన్‌బాషా నాలుగు మెడికల్‌ సంస్థలైన కోటిల్‌, భారత్‌ హెల్త్‌ కేర్‌, పినాకిల్‌ బ్లూమ్స్‌, పినాకిల్‌ బ్లూమ్స్‌ నెట్‌వర్క్స్‌ అనే మెడికల్‌ సంస్థల వద్ద ఆ బాలుడికి వైద్య చికిత్స చేయించడానికి చేర్పించారు. 12 క్రెడిట్‌ (సిట్టింగ్‌)లకు గాను రూ.1.20 లక్షలు ఫీజుగా ఫిర్యాది ముందే చెల్లించారు. అయితే.. చికిత్స మధ్యలోనే ఆరు నెలల తర్వాత వైద్యాన్ని ఆపేయడంతో ఆ బాలుడు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆ బాలుడి సంరక్షకుడు, తల్లి తీవ్ర మానసిక ఆవేదనకు గురై జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్‌ ఆ బాలుడికి చికిత్స నిలిపివేసి సేవాలోపం చేయడమే కాకుండా వారికి మానసిక ఆవేదనకు గురి చేయడం తీవ్రమైన సేవాలోపం అని నిర్ధారించింది. దీంతో బాలుడి సంరక్షకుడు చెల్లించిన మొత్తంలో రూ.60వేలను 12 శాతం వడ్డీతో వాపసు చేసి తల్లిదండ్రులను మానసిక ఆవేదనకు గురి చేసినందుకు రూ.3 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద అదనంగా రూ.10వేలు మెడికల్‌ సంస్థలు ఫిర్యాదికి 45రోజుల్లోపు చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ కరణం కిశ్‌ర్‌ కుమార్‌, సభ్యుడు ఎన్‌.నారాయణరెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Nov 24 , 2026 | 12:16 AM