కాలువనూ వదల్లేదు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:28 AM
పట్టణంలో అక్రమార్కులు మురికి కాలువలను కూడా వదలడం లేదు. కాలువలపైనే దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తుండటతో మురుగు సరిగా పారడం లేదు.
ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఆక్రమణలు
మురుగు వెళ్లక స్థానికులకు ఇబ్బందులు
నిద్రావస్థలో మున్సిపల్ అధికారులు
ఆళ్లగడ్డ, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలో అక్రమార్కులు మురికి కాలువలను కూడా వదలడం లేదు. కాలువలపైనే దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తుండటతో మురుగు సరిగా పారడం లేదు.
ప్రధాన కాలువ ఆక్రమణ
ఆళ్లగడ్డలోని ఎస్వీ నగర్ నుంచి ప్రారంభ మయ్యే ప్రధాన కాలువ కూడా ఆక్రమణకు గురికావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏసునాథ పురం, ఎల్‌ఎం కాంపౌండ్, ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మినీ థియేటర్ మీదుగా బృందావనం కాలనీ, పట్టణ శివారులోని వక్కిలేరులో కలిసేలా అప్పట్లో కాలువను నిర్మించారు. ప్రధాన మురుగు కాలువకు పట్టణంలోని అన్ని కాలనీల మురుగు చేరేలా అనుసంధానం చేశారు. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3.5 కోట్లతో దాదాపు 1.5 కి.మీ.ల మేర కాలువను నిర్మించారు. అయితే కాలువ ఆక్రమణలకు గురికావడంతో పారిశుధ్య పనులు చేసేందుకు వీలు కావడం లేదు.
నిద్రమత్తులో మున్సిపల్ అధికారులు
పట్టణ ప్రధాన కాలువ ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు నిద్రావస్ధలో ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువ పక్కన 15 అడుగుల ఖాళీ స్ధలం ఉండగా అది కూడా అక్రమణకు గురైంది. మినీ ఽ థియేటర్ సమీపంలో కాల్వ పక్కన ఉన్న స్ధలాన్ని కొందరు అక్రమించి దుకాణాల షెడ్లను నిర్మించుకున్నారు. అలాగే కొత్త మసీదు ప్రాంతంలో కాల్వ పక్కన అక్రమ కట్టడాలు వేలిశాయి. మినీ థియేటర్ పక్కన కాలువపైకి ఇళ్లు నిర్మించినా మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాలనీవాసుల అవస్థలు
మురుగు ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎల్‌ఎం కాంపౌండ్, సాగర్ వీధి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు ముందుక పోక దోమలు వ్యప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
పట్టణంలోని ప్రధాన మురుగు కాలువపై అక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కాలువపై ఇల్లు, ఇతర నిర్మాణాలకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. తనిఖీలు చేస్తాం. - కిషోర్, మున్సిపల్ కమిషనర్, ఆళ్లగడ్డ