Share News

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:25 PM

జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పట్టణంలోని కలెక్టరేట్లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఉగాది నాటికి 10,178 గృహాలను పూర్తి చేయాలన్నారు. లక్ష్యసాధనలో భాగంగా వారపు లక్ష్యాలను నిర్దేశించుకొని సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 374 గృహాలు పూర్తయ్యాయన్నారు. బేస్‌మెంట్‌, లెంటల్‌, రూఫ్‌ లెవెల్లో ఉన్న గృహాలన్నింటినీ ఉగాదికల్లా పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద మంజూరైన 2,348 గృహాల్లో 584 గృహాలకు గ్రౌండింగ్‌ పూర్తయ్యిందని, మిగిలిన 1630 గృహాలకు ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. చెంచుకాలనీల్లో పీఎం జన్మన్‌ పథకం కింద మంజూరైన 556 గృహాల్లో 302 గృహాలు గ్రౌండింగ్‌ అయ్యాయని, మిగిలిన గృహాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరైన 26,609 యూనిట్లలో 12,616 పూర్తి అయ్యాయని మిగిలిన వాటిని వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ కింద మంజూరైన 12,715 గృహాల్లో 8,112 పూర్తయ్యాయని మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 19 , 2026 | 11:25 PM