పింఛన్ దరఖాస్తుల్లో గందరగోళం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:14 AM
జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల అర్హులైన చేనేత కార్మికుల ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. చేనేత పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా..? నిర్ధారించి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు నివేదిక పంపాలని నిబంధనలు చెబుతున్నాయి.
చేనేత, జౌళి శాఖ ధ్రువీకరణ పత్రం కోసం అవస్థలు
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఉండగానే అధికారుల విచారణ
రాజకీయ నేతల సిఫార్సు ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ
కర్నూలు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల అర్హులైన చేనేత కార్మికుల ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. చేనేత పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా..? నిర్ధారించి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు నివేదిక పంపాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగాలి. అయితే జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు ముందే విచారణ పేరుతో హడావుడి చేసి, రాజకీయ సిఫార్సులు ఉన్నవాళ్లకు ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చేనేత వృత్తిపై ఆధారపడి 15వేలకు పైగా చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. చేనేతలకు భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఫించన్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, నేతన్న సేవలో పథకం ద్వారా రూ.25 వేలు ఆర్థిక చేయూత అందిస్తోంది. అర్హులైన చేనేతలతో పాటు వివిధ వర్గాల వారు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 7వ తేది నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు(ఎస్‌జీఎ్‌సడబ్ల్యూ) కార్యాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వెల్ఫేర్ లాగిన్ నుంచి తీసుకున్న దరఖాస్తులను 21వ తేది వరకు లబ్ధిదారుల ప్రాథమిక అర్హత పరిశీలన చేయాలి. 22 నుంచి 24 వరకు మూడు రోజులు క్షేత్రస్థాయిలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌కు నివేదిక పంపాల్సి ఉంటుంది.
విచారణ పేరుతో గందదగోళం..
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 18వ తేది వరకు గడువు ఉంది. అయితే.. ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చిన ఆఫ్‌లైన్ దరఖాస్తుల విచారణ పేరుతో చేనేత, జౌళి శాఖ అధికారులు ఈ నెల 14న హడావుడి చేశారు. ‘చేనేత కార్మికుల ధృవీకరణ పత్రం’ జారీ చేశారు. అదీ రాజకీయ సిఫార్సులు ఉన్నవారికే మాత్రమే ఇవ్వడంతో గందరగోళం తలెత్తింది. పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలోని వెల్ఫేర్ అసిసెంట్ వద్దకు వెళితే, చేనేత, జౌళి శాఖ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాలని తెగేసి చెబుతున్నారు. ధృవీకరణ పత్రం కోసం ఎమ్మిగనూరు, కోడుమూరు నుంచి కర్నూలులోని చేనేత, జౌళి శాఖ ఏడీ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. అక్కడికి వెళితే సరైన సమాధానం లేదు.
అర్హులు 450 మంది చేనేతలేనా..?
జిల్లాలో ఎమ్మిగనూరులో 250, కోడుమూరులో 125, ఆదోనిలో 30, ఇతర ప్రాంతాల్లో 45 చొప్పున 450 మంది చేనేత కార్మికులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సంఖ్య చాలా గందరగోళానికి దారి తీసింది.
99శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాం
చేనేత కార్మికులు 99శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికుల దరఖాస్తులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం - నాగరాజరావు, ఏడీ, చేనేత, జౌళి శాఖ, కర్నూలు