ముచ్చుమర్రి-ఓర్వకల్లు పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:19 AM
ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు పీఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నీటి పైప్‌లైన్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నందికొట్కూరు జూన్ 3(ఆంధ్రజ్యోతి): ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు పీఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నీటి పైప్‌లైన్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలో ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు కొనసాగుతున్న పైప్‌లైన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, పైప్‌లైన్ ఏర్పాటు, నిర్మాణ నాణ్యత, సాంకేతిక అంశాలు, ఎదురవుతున్న సమస్యలు మొదలైన వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దశ పనినీ పర్యవేక్షించాలనా అధికారులకు సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొంటూ, పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై నందికొట్కూరు ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై శాఖల వారీగా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వాటి పూర్తి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఈ పైప్‌లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోన్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఆత్మకూరు ఆర్‌డీవో వెంకటశివ, నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.