గడువు లోపు పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:19 AM
ఓర్వకల్లు-కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ర్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా అధికారులను ఆదేశించారు.
డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా
ఎన్‌ఐసీడీసీ ప్రాజెక్టుల ప్రాంతాల్లో మొక్కలు నాటిన కేంద్ర బృందం
ఓర్వకల్లు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు-కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ర్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని గుట్టపాడు సమీపంలో అభివృద్ధ్ది చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఎన్‌ఐసీడీసీ) ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. మొదటి దశలో 2,621 ఎకరాల్లో చేపడుతున్న రహదారులు, తాగునీటి సరఫరా వ్యవస్థ, డ్రైనేజీ, విద్యుత్, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎన్‌ఐసీడీసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ కార్యాదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓర్వకల్లు-కొప్పర్తి నోడ్‌ల అభివృద్ధి ప్రణాళికలు, ప్రతిపాదిత పరిశ్రమలు, మౌలిక వసతుల పనుల స్థితిగతులను వివరించారు. ఓర్వకల్లు నోడ్‌లో 2,621 ఎకరాలు, కొప్పర్తి నోడ్‌లో 2,596 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న రహదారులు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ తదితర సదుపాయాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచడంతో పాటు డిజైన్, నిర్మాణ ప్రమాణాలు, నాణ్యత తనిఖీల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ఓర్వకల్లు నోడ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. ఎన్‌ఐసీడీసీ సీఈవో, ఎండీ రజత్‌కుమార్ షైనీ, ఏపీఐఐసీ ఎండీ దినే్‌షకుమార్, కలెక్టర్ ఏ.సిరి, ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు హరిదర్, మణి భాస్కర్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ శంకర్‌మాణిక్యం పాల్గొన్నారు.