విద్యుత్ స్తంభాల ఏర్పాటును పూర్తి చేయండి
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:06 AM
ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను మార్చి 31నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్‌ఎస్ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను మార్చి 31నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఎస్‌ఎస్ పథకం అమలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందించడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎక్సైజ్ శాఖకు వార్షికంగా రూ.1,200 కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.1,159 కోట్ల ఆదాయం సాధించిందన్నారు. మైనింగ్ శాఖకు రూ.247 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.231 కోట్ల ఆదాయం, వాణిజ్య పన్నుల శాఖకు రూ.757.89 కోట్ల లక్ష్యముండగా రూ.584.27 కోట్ల ఆదాయం, రిజిస్ర్టేషన్ శాఖకు రూ.201 కోట్ల లక్ష్యంకాగా రూ.183 కోట్లు, రవాణా శాఖకు రూ.160.54 కోట్ల లక్ష్యంకాగా రూ.117.33 కోట్ల ఆదాయం వసూలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, శ్రీశైలం సబ్ డీఎఫ్‌ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.