సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయండి
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:29 PM
బనగానపల్లె పట్టణంలో ఈనెల 9న మీ భూమి, మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టరు రాజకుమారి, ఎస్పీ సునీల్‌షోరాన్ అఽధికారులను సోమవారం ఆదేశించారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
బనగానపల్లె, జూలై 6( ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణంలో ఈనెల 9న మీ భూమి, మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టరు రాజకుమారి, ఎస్పీ సునీల్‌షోరాన్ అఽధికారులను సోమవారం ఆదేశించారు. బనగానపల్లెలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంత్రి బీసీతో కలసి కలెక్టరు బనగానపల్లెలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి అంశంలో సమన్వయంలో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్‌తో కలసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలు, తహసీల్దారు కార్యాలయం, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలను పర్యటించి ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అన్నారు. ప్రతి ఏర్పాటును నాణ్యతతో సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందును తాగునీరు, పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్, ట్రాపిక్ మళ్లింపు, షామియానాలు, ప్రజలు సభలో కూర్చునే సీటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడ్లు, తదితర సదుపాయలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ట్రాఫిక్ నియం త్రణ సరిగా నిర్వహించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సులభంగా రాకపోకలు సాగించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పోలీసు, రెవిన్యూ, రోడ్లు భవనాల, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆరోగ్య, ఆర్‌డ బ్యూఎస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టరు రాజకు మారి మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్, రెవిన్యూ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
నంద్యాల నూనెపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వద్దని, అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో, పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీ ఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం పర్యట నకు సంబంధించిన నోట్స్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు ఉంటే సరిదిద్ది సవరించిన సమాచారాన్ని తక్షణమే సమర్పించాలన్నారు. స్టాళ్ల ఏర్పాటు, ఫ్లెక్సీల రూపకల్పన, ప్రదర్శించనున్న అంశాలు ముఖ్యమంత్రికి సమర్పించనున్న బ్రీఫింగ్ నోట్స్‌ను వెంటనే సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాఖకు సంబం ధించిన గణాంకాలు పూర్తిగా కచ్చితంగా ఉండాలన్నారు. యాక్షనబుల్ పా యింట్స్‌లో ప్రతి అంశానికి కొలిచే విధంగా స్పష్టమైన గణాంకాలు ఉండాల న్నారు. మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, మిర్చి ఉత్పత్తి, పండ్ల తోటలు, ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, పరిశ్రమల సంఖ్య, 500 ఎంఎస్‌ఎంఈల ద్వారా కల్పించిన ఉపాధి తదితర సమర్పించాలన్నారు. అలాగే సబ్ సెక్టార్ వారీగా జీవీఏ, జిల్లా 15 శాతం వృద్ధిరేటుకు సంబంధించిన వివరాలను పొందుపరచాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, సమయపాలనతో, తమ శాఖ అంశాలపై సంపూర్ణ అవగాహనతో పనిచేసి సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేయాలన్నారు.