Share News

డైట్‌ కాంట్రాక్టు టెండర్‌కు పోటా పోటీ..

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:49 AM

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్‌ కాంట్రాక్టులకు డిమాండ్‌ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు రాజకీయ నేతలు జోక్యంతో టెండర్‌ పోటాపోటీగా మారింది.

డైట్‌ కాంట్రాక్టు టెండర్‌కు  పోటా పోటీ..

తమ వారికే దక్కాలంటూ నేతల ఒత్తిడి

పోటీలో 11 మంది

నేడు కర్నూలు జీజీహెచ్‌ డైట్‌ టెండర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్‌ కాంట్రాక్టులకు డిమాండ్‌ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు రాజకీయ నేతలు జోక్యంతో టెండర్‌ పోటాపోటీగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి డైట్‌ కాంట్రాక్టు గడువు ముగియడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డైట్‌ టెండర్‌లో ప్రకటన ఇచ్చారు. కర్నూలు జీజీహెచ్‌, ఐ హాస్పిటల్‌, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు చెందిన రోగులు, వైద్యులు, వైద్య విద్యార్థులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు నెలకు రూ.30 లక్షలు వరకు ఖర్చు అవుతుందని, ఏడాదికి రూ.3.60 కోట్ల లావాదేవీల ఉన్న బిల్లు ఉన్న ఈ కాంట్రాక్టు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు కొందరు నేతలు ఆసుపత్రి అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన కాంట్రాక్టర్లలో కొందరు అవసరమైతే ఎంతైనా చెల్లించుకోవడానికి సిద్ధమయినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రి డైట్‌ టెండర్‌ను దక్కించుకోవాలంటే నిబంధనల ప్రకారం టెండర్‌దారులపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు. బోధనాసుపత్రిలో 500 పడకలు ఉన్న రోగులకు ఇది వరకు ఆహారాన్ని సరఫరా చేసి ఉండాలి. ఏడాదికి రూ.25 లక్షల వార్షిక టర్నోవర్‌, జీఎస్టీ, ఐటీ సహా అన్నీ పక్కాగా చెల్లించి ఉండాలి. అయితే ఈసారి టెండర్లులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గుత్తేదారులు ఉండటం విశేషం.

రంగంలో 11 మంది

ఆసుపత్రిలో డైట్‌ నిర్వహణకు సంబంధించి టెండర్లు వేసేందుకు 15 మంది దరఖాస్తులు తీసుకున్నారు. వీరిలో 11 మంది మాత్రమే టెండర్లు వేశారు. వీరిలో హైదరాబాదు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు ప్రాంతానికి చెందిన వారున్నారు. ఇందులో కర్నూలుకు చెందిన వ్యక్తికి స్థానికంగా ఓ హోటల్‌, మెస్‌, క్యాటరింగ్‌ సర్వీసులు, బిర్యాని పాయింట్‌ ఉన్నాయి. ఓ రిటైర్డు హాస్టల్‌ వార్డెన్‌ కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం డైట్‌ను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ టెండర్‌ను దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. తమ వాడికే కాంట్రాక్టు ఇవ్వాలని ఓ నేత అంటే.. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని మరో నాయకుడు అధికారులపై ఒత్తిడి చేస్తున్న ట్లు తెలుస్తోంది. ఇట్లా డైట్‌ కాంట్రాక్టర్‌ దక్కించుకునేందుకు రాజకీయ నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

నేడు డైట్‌ టెండర్లు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రోగులు, వైద్యులు వైద్య విద్యార్థులకు ఆహారం సరఫరా చేసే డైట్‌కు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన టెండర్లు జరగనున్నాయి. ఈ టెండర్‌కు 15 మంది దరఖాస్తులు తీసుకోగా, 11 మంది గుత్తేదారులు టెండర్లు వేశారు. రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ డైట్‌ టెండర్లు నిర్వహిస్తున్నాం. - డా.కె. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌

Updated Date - Feb 13 , 2026 | 12:49 AM