Share News

పదవుల పోరు..!

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:14 PM

పరిషత్‌ ఎన్నికల సమరం ముగిసింది. పదువుల పందెం మొదలైంది. జడ్పీ చైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాల ఎంపికకు ముహూర్తం ఖరారైంది. దీంతో అశావహుల్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది

పదవుల పోరు..!

జడ్పీ చైర్మన్‌, మండలాధీశుల ఎంపికకు ముహూర్తం ఖరారు

ఆశావహుల్లో పెరిగిన ఉత్కంఠ

అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ ఆశీస్సుల కోసం పరుగులు

ముఖ్య నాయకుల వద్ద పంతనాలు

ఆదృష్టం ఎవరిని వరిస్తుందో..?

కర్నూలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పరిషత్‌ ఎన్నికల సమరం ముగిసింది. పదువుల పందెం మొదలైంది. జడ్పీ చైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాల ఎంపికకు ముహూర్తం ఖరారైంది. దీంతో అశావహుల్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. ఇన్నాళ్లు పార్టీ గెలుపు కోసం శ్రమించిన నాయకులు ఇప్పుడు పదవి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. అదే సమయంలో అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా విజయం సాధించిన యువనేతలు సైతం పదవుల పందెంలో సీనియార్టీని దాటుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 19న మండలాధీశుల ఎంపిక, 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నికు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రాపునేఠా ముహూర్తం నిర్ణయిస్తూ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో పదవులు ఆశిస్తున్న ఆశావహులు, వారికి మద్దతుగా నిలుస్తున్న నాయకులు అధినేత, యువనేతల ఆశీస్సుల కోసం ముఖ్య నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు.

కర్నూలు జిల్లా సమితిగా 1959లో ఏర్పడింది. 1987లో జిల్లా పరిషత్‌ (జడ్పీ) మార్పు చేశారు. ఆనాటి నుంచి 2021 వరకు 13 పర్యాయాలు జడ్పీకి ఎన్నికలు జరిగాయి. 16మంది చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. వారిలో ముగ్గురు ఇన్‌చార్జి, తాత్కాలిక అధ్యక్షు లుగా బాఽధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి కర్నూలు ప్రథమ జడ్పీ చైర్మన్‌గా కోట్ల విజయభాస్కరరెడ్డి బాధ్యతలు చేపడితే, చివరి చైర్మన్‌గా యర్రబోతుల పాపిరెడ్డి 2022లో బాధ్యతలు చేపట్టి అ ఏడాది సెప్టెంబరు 24 వరకు కొనసాగారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి 20 జడ్పీటీసీ స్థానాలు దక్కించుకొని చైర్మన్‌ పీఠం తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ బలం ఒక్కటే 19 స్థానాలు. టీడీపీ రెబల్‌గా విజయం సాధించిన హొళగుంద జడ్పీటీసీ ఈడిగ గోవిందగౌడ్‌ సైతం ఇప్పటికే టీడీపీలోనే కొనసాగుతున్నానని ఆ పార్టీ ముఖ్య నాయకులను కలసి సంకేతాలు పంపించారు. అంటే టీడీపీ బలం 20, బీజేపీ ఒక సీటుతో కలిపితే కూటమి బలం 21 జడ్పీటీసీ సభ్యులు. దీంతో టీడీపీకే పీఠం వశమైనట్లే. ఆ పీఠంపై కూర్చోవాలంటే అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ఆశీస్సులు ఉండాల్సిందే.

జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్సన్‌ సభ్యుల ఎంపిక షెడ్యూల్‌

వివరాలు మండల పరిషత్‌ జిల్లా పరిషత్‌

జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ నోటీస్‌ జారీ 14వ తేది 14వ తేది

కో-ఆప్టెడ్‌ సభ్యుల కోసం నామినేషన్లు 19న ఉదయం 10 గంటలకు 20న ఉదయం 10 గంటలకు

పరిశీలన మధ్యాహ్నం 12 గంటలోపు మధ్యాహ్నం 12 గంటలోప

అభ్యర్థుల జాబితా 12 గంటల తరువాత 12 గంటల తరువాత

విత్‌డ్రాకు సమయం మధ్యాహ్నం ఒంటి గంటలోపు మధ్యాహ్నం ఒంటి గంటలోపు

కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంటకు

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు --

జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సమావేశం -- మధ్యాహ్నం 3 గంటలకు

అమరావతికి పరుగులు

టీడీపీ అభ్యర్థులుగా బరిలో దిగి జడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన 19 మందిలో అత్యంత సీనియర్‌ నాయకుడు కౌతాళం జడ్పీటీసీ చుడి ఉలిగయ్య. అతి పిన్న వయస్కురాలు దేవనకొండ జడ్పీటీసీ సభ్యురాలు 22 ఏళ్ల షేక్‌ సాధిక. ఈమె ఎంబీబీఎస్‌ చదువుతోంది. చుడి ఉలిగయ్య ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నాడు. సీనియారిటీ అర్హతగా తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా ముఖ్య నాయకుల మద్దతు కూడగట్టుకుంటూనే అమరావతికి పయనమయ్యారు. అధినేత, యువనేతల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే.. విద్యావంతులైన యువతరం నాయకత్వానికి అవకాశం ఇవ్వాలంటూ దేవనకొండ, తుగ్గలి జడ్పీటీసీ సభ్యులు షేక్‌ సాధిక, మిద్దె గీతాకుమారిలకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్పీ చైర్మన్‌ పీఠం ఇస్తే రూ.6-10 కోట్లు ఖర్చు పెట్టడానికి తాము సిద్ధమంటూ ఒకరిద్దరు ముఖ్య నాయకుల ద్వారా అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే క్రమంలో మండలాధీశులు (ఎంపీపీ), మండల పరిషత్‌ ఉపాధ్యక్షుల పీఠాలు ఆశిస్తున్న ఎంపీటీసీలు అవకాశం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను కలుస్తున్నారు. అదే క్రమంలో రాష్ట్ర నాయకత్వం ద్వారా ఎమ్మెల్యేలకు సిఫార్సులు చేయిస్తున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఖర్చు పెట్టుకుంటాం.. మాకు అవకాశం ఇవ్వాలంటూ ఎంపీపీ పీఠం ఆశిస్తున్న కొందరు ఎంపీటీసీలు ఆర్థిక భరోసా కూడా ఇస్తున్నట్లు సమాచారం.

Updated Date - Nov 10 , 2026 | 11:21 PM