వెనక్కి వచ్చేయండి..!
ABN , Publish Date - May 26 , 2026 | 11:25 PM
‘స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డుల’తో పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
‘స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు’ ఉద్యోగులకు పిలుపు
జిల్లాలో 129 మందికి ఉత్తర్వులు జారీ
ఈ నెలాఖరులోగా విధుల్లో చేరాలని ఆదేశం
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
‘స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డుల’తో పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వర్ణగ్రామ- వార్డులో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు, సేవలను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా డిప్యుటేషన్ల వ్యవస్థపై ఉక్కుపాదం మోపింది. జిల్లాలో వివిధ శాఖల్లో డిప్యుటేషన్లపై పని చేస్తున్న స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు ఉద్యోగులను తిరిగి వారి అసలు పోస్టులకు పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇతర శాఖల్లో తిష్ఠ వేసిన డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఇతర శాఖల్లో డిప్యుటేషన్లపై విధులు నిర్వహిస్తున్న స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు ఉద్యోగులను తక్షణమే వెనక్కి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశా లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కలెక్టర్లతో పాటు, సంబంధిత శాఖాధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశాలు జారీ అయ్యాయి.
129 మంది వెనక్కి
అధికార వర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో మొత్తం 129 మంది స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు ఉద్యోగులు ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లపై విధులను నిర్వహిస్తున్నారు. సొంత విధులను పక్కనపెట్టి ఇతర చోట్ల కొనసాగుతున్న వారిలో సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీ రింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి డిప్యుటేషన్ల రద్దుతో స్వర్ణ గ్రామ- వార్డు వ్యవస్థ మళ్లీ పూర్తి స్థాయిలో గాడిలో పడనుందని అధికారులు భావిస్తున్నారు.
పారదర్శక పాలన
స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు ద్వారా ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వం లక్ష్యం. సిబ్బంది కొరత సాకుతో ప్రజలకు సేవలు ఆలస్యం కాకూడదనే ఈ డిప్యుటేషన్లను రద్దు చేశారు.
డిప్యుటేషన్ల వివరాలు
కర్నూలు నగరంలో - 78 మంది
ఆదోనిలో - 15 మంది
వివిధ మండలాల్లో - 36 మంది
జీతాలు కట్
ఈవ్యవహారంలో ప్రభుత్వం కేవలం ఆదేశాలివ్వడమే కాకుండా గడువును కూడా చాలా కఠినంగా విధించింది. ప్రస్తుత మే నెలా ఖరులోగా డిప్యుటేషన్‌పై ఉన్న ఉద్యోగులందరూ కచ్చితంగా విధుల నుంచి రిలీవ్ అయి, తమకు కేటాయించిన అసలు స్వర్ణ - గ్రామ, వార్డులో విధుల్లో చేరాలని స్పష్టంచేసింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశా లను బేఖాతరు చేస్తూ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. అలాంటి ఉద్యోగు లపై శాఖాపరమైన చర్యలతో పాటు జూన్ 1 నుంచి జీతాలు నిలు పుదల చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.