సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:07 AM
సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం తాగి విధులకు హాజరైన పసురపాడు గ్రామపంచాయతీ విజయ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు.
మద్యం తాగి విధులకు వచ్చిన ఉద్యోగిపై చర్యలు
డిప్యూటీ ఎంఈడీవోకు మెమో
గోస్పాడు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం తాగి విధులకు హాజరైన పసురపాడు గ్రామపంచాయతీ విజయ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు. మంగళవారం పసురపాడు స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వంటి అంశాలను, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. సేవల నాణ్యతపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించాలన్నారు. తనిఖీ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ మద్యం తాగి విధులకు హాజరైనట్లు కలెక్టర్ గమనించారు. వెంటనే పోలీసుల సాయంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా 100 మి.లీ లీటర్లకు 65 మి.లీ గ్రాముల అల్కహాల్ స్థాయి నమోదైనట్లు తేలింది. సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీఓపై చార్జీ మెమో జారీ చేయాలని సూచించారు.