భూగర్భజలాల పెంపునకు సీఎం కృషి
ABN , Publish Date - May 02 , 2026 | 10:33 PM
అపరభగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
‘జలధార-జలహారతి’ని కలెక్టర్‌తో కలిసి ప్రారంభించిన మంత్రి బీసీ
కొలిమిగుండ్ల, మే 2(ఆంధ్రజ్యోతి): అపరభగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మండలంలోని హనుమంతుగుండం పెద్ద చెరువులో జలధార జలహారతి కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ రాజకుమారితో కలిసి ప్రారంభించారు. చెరువులో మంత్రి, కలెక్టర్ స్వయంగా మట్టిని తవ్వి ఉపాధి కూలీలను ఉత్తేజ పరిచారు. అనంతరం జరిగిన రైతుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాను దద్దణాల ప్రాజెక్టు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకువస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ధ్వంసం చేశారని మండి పడ్డారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కొలిమిగుండ్ల మండంలో దయ్యాల చెరువు నుంచి చిలార్ చెరువు, తిమ్మనాయునిపేట చెరువు, హనుమంతుగుండం పెద్ద చెరువు, చిన్న చెరువు వరకు 18 కి.మీ. కాలువను కింద వీబీ రామ్‌జీ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో అందుబాటులో 287 చెరువులు: కలెక్టర్
జిల్లాలో మొత్తం 287 అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఎస్సార్బీసీ, అటవీ, వర్షాధారిత చెరువులతో ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జిల్లాలోనే అత్యంత లోతులో జలమట్టం ఉన్న ప్రాంతం కొలిమిగుండ్ల మండలం అని అన్నారు. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపుతో నీటిమట్టాన్ని పెంచడానికి కృషి చేస్తునట్లు తెలిపారు. జుర్రేరు వాగు అభివృద్ధితో భవిష్యత్తులో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ, ఏపీడీ, ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ నాయకులు మూలే రామేశ్వర్ రెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వర్ రెడ్డి, పులి ప్రకాష్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, వివేకానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.