అటవీ శాఖ అధికారులపై సీఎం ఆగ్రహం
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:41 PM
శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శివ భక్తులు, దీక్షాపరులకు నల్లమలలో పాదయాత్రకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో శ్రీశైలం భక్తుల ఉద్రిక్తతకు దారి తీసింది.
పద్ధతి మార్చుకొని ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి
కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు
నంద్యాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శివ భక్తులు, దీక్షాపరులకు నల్లమలలో పాదయాత్రకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో శ్రీశైలం భక్తుల ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే విషయంపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం చంద్రబాబు సైతం అమరావతిలో రెండో రోజైన గురువారం మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సదరు ఘటన దృష్టిలో పెట్టుకుని ఆటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల, మార్కాపురం ఆటవీశాఖ అధి కారుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. శ్రీశైలానికి వచ్చే భక్తులకు పాద యాత్రకు అనుమతి కల్పించకపోవడంతోనే సమస్య ఏర్పడిందని గుర్తు చేశారు. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలా? అని చురకలు అంటించారు. అంతేకాకుండా టోల్‌గేట్ సమీపంలో కూడా ఆటవీశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ప్రధానంగా ఆటవీశాఖ అధికారులు పద్ధతి మార్చుకుని శ్రీశైలానికి వచ్చే భక్తులతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. ‘మర్యాదగా చెప్తున్నా.. వినండి. లేకుం టే చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి వస్తుంది..’ అంటూ అటవీశాఖ అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనవసరంగా భక్తులను ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదని చంద్రబాబు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.