ప్రజలపై భారం పడకుండా సీఎం చర్యలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:20 AM
ప్రజలపై విద్యుత్ ట్రూ అప్ చార్జీల భారం పడకుండా రూ.4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తుందని, ఇందుకోసం చర్యలు తీసుకుందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
సుమారు రూ.4,500 కోట్లు విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలపై విద్యుత్ ట్రూ అప్ చార్జీల భారం పడకుండా రూ.4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తుందని, ఇందుకోసం చర్యలు తీసుకుందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బనగానపల్లెలో ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ మాట్లాడుతూ విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.13 పైసలు తగ్గించిందని తెలిపారు. డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్‌సీకి ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. పేద, మధ్య, సామాన్య గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల భారం బిల్లులు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. వైసీపీ అస్తవ్యస్థ విధానాలతో విద్యుత్ కోతలతో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు నరకం చూశారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ రంగానికి 1.29లక్షల కోట్లు అప్పులుగా మిగిల్చారని మంత్రి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ను యూనిట్ రూ 5.19లకు కొనుగోలు చేస్తే కూటమి ప్రభత్వుం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ విద్యుత్‌ను రూ.4.70పైసలకే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించిందన్నారు. ఆక్వా రైతులపై వైసీపీ పాలనలో యూనిట్‌కు రూ.3.50పైసలు వసూలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం యూనిట్‌కు రూ.1.50పైసలకు తగ్గించి అక్వారైతులకు అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధ్యాన్యం కల్పిస్తూ సోలార్, పవన విద్యుత్‌లకు అధిక సబ్సిడీని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తోందన్నారు.
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి
బనగానపల్లె, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వినతిపత్రాలను మంత్రి స్వీకరించారు. అర్జీలను స్వయంగా స్వీకరించి, అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ, ఫించన్, ఉద్యోగ ఉపాధి వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.