Share News

రేపు సీఎం చంద్రబాబు రాక

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:27 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు సీఎం చంద్రబాబు రాక
సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బీసీ, కలెక్టర్‌ రాజకుమారి

బనగానపల్లెలో పర్యటన

మీ భూమి- మీ హక్కు కార్యక్రమానికి హాజరు

రైతులకు పాసుపుస్తకాల పంపిణీ

నంద్యాల, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. బనగానపల్లె మండల కేంద్రంలో జరిగే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు బయల్దేరుతారు. మధ్యాహ్న 11:20 గంటలకు బనగానపల్లెకు హెలీకాఫ్టర్‌ ద్వారా చేరుకుంటారు. ముందుగా బనగానపల్లె తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ప్రజలు, రైతులకు అందించే సేవలపై ఆరా తీస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 12:30 గంటలకు జరిగే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి 5:20కు అమరావతికి చేరుకుంటారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి బీసీ

బనగానపల్లె: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లె పర్యటన నిమిత్తం ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం పరిశీలించారు. సీఎం ప్రోగ్రాం కో.ఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేశ్‌తో కలసి వారు హెలిప్యాడ్‌, హైస్కూల్‌లోని సభా ప్రాంగణం, సభావేదిక, పార్కింగ్‌ స్థలాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవే క్షించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేస్తుండడంతో తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు ట్రాఫిక్‌ నియంత్రణ, నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడాలని మంత్రి కోరారు. సభ విజయవంతం కావడానికి అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పాసు పుస్తకాల పంపిణీ

బనగానపల్లె సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేసే పట్టాదారు పాసుపుస్తకాలతో కలిపి ఇప్పటి వరకు 29 లక్షల దాకా పంపిణీ పూర్తవుతుంది. అధికార లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,887 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయడంతో పాటు 29.04 లక్షల మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెల రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 428 గ్రామాల్లో 2.48 లక్షల మంది రైతులకు పుస్తకాలను అందజేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చికి 9,929 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 64.53 లక్షలు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో 8,412 మందికి, బనగానపల్లెలో 1,125 మందికి చెందిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించి సిద్ధం చేసింది.

Updated Date - Jul 07 , 2026 | 11:27 PM