Share News

మూతబడ్డ సీసీఐ కేంద్రాలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:34 PM

మార్కెట్‌లో క్వింటం పత్తి రూ.8,500 పైగానే పలుకు తోంది.

మూతబడ్డ సీసీఐ కేంద్రాలు
పెంచికలపాడు సీసీఐ కేంద్రంలో నిలిచిపోయిన పత్తి విక్రయాలు

మద్దతు ధరకంటే మార్కెట్‌లోనే ఎక్కువ

సీసీఐ కొన్నది 7.39 లక్షల క్వింటాళ్లు

రైతుల ఖాతాలకు రూ.579 కోట్లు జమ

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో క్వింటం పత్తి రూ.8,500 పైగానే పలుకు తోంది. సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 మాత్రమే. దీంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల మొదటి తేదీ నుంచి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకెళ్ల డం లేదు. ఫలితంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 17 కొనుగోలు కేంద్రాలు మూతపడ్డాయి. నవంబరు నెల నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ఉమ్మడి జిల్లాలో మొదలయ్యాయి. ఇప్పటి దాకా కర్నూలు జిల్లాలోని 16 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా 24,724 మంది రైతులు పత్తిని అమ్ముకున్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా 7,39,807 క్వింటాళ్ల పత్తిని సేకరించినట్లు మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి నారాయణమూర్తి తెలిపారు. రూ.579.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు సీసీఐ సంస్థ చెల్లించిందన్నారు. ఎవరికైనా డబ్బులు జమ కాకుంటే తమ కార్యాలయాల్లో లేదా ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం మార్కెట్‌ కమిటీ కార్యాలయాల్లో సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 05 , 2026 | 11:34 PM