పరిశుభ్రత.. ప్రజారోగ్యమే లక్ష్యం
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:50 PM
నగర పరిశుభ్రతే లక్ష్యంగా.. ప్రజారోగ్యమే బాధ్యతగా..! మేము సైతం అంటూ నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కదిలారు.
44, 45 వార్డుల్లో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్
పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నగరంలో రూ.87 లక్షలతో మురుగు కాలువల్లో పూడికతీత
నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
‘అక్షరం అండగా..’ కార్యక్రమానికి స్పందన
కర్నూలు/కర్నూలు న్యూసిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నగర పరిశుభ్రతే లక్ష్యంగా.. ప్రజారోగ్యమే బాధ్యతగా..! మేము సైతం అంటూ నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కదిలారు. మంగళవారం రామలింగేశ్వర నగర్‌లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేశారు. చెత్తాచెదారం అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించారు. ఎంఈ మనోహర్‌రెడ్డితో కలసి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించారు. పూడికతో నిండిపోయిన డ్రైనేజీలను పరిశీలించారు. ప్రత్యేక ఎక్స్‌కవేటర్లు పెట్టి పూడికతీత పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ నెల 20న శుక్రవారం ఏబీఎన-ఆంధ్రజ్యోతి నగరపాలక సంస్థ 44, 45 వార్డుల పరిధిలోని రామలింగేశ్వర నగర్ కాలనీ పార్కులో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిఽథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత హాజరైన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పలు సమస్యలు మంత్రి టీజీ భరత దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తానని మంత్రి టీజీ భరత స్పష్టమైన హామీ ఇచ్చారు. అందులో భాగంగా మంగళవారం పారిశుధ్య పనుల స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. పదుల సంఖ్యలో పారిశుధ్య సిబ్బంది ఉదయం ఆరు గంటలకే వీధులు, డ్రైనేజీలు శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పనులను పర్యవేక్షించారు. రామలింగేశ్వర నగర్, మాచాని సోమప్ప నగర్, రాజీవ్ గాంధీ పార్కులను పరిశీలించి వాకర్స్‌తో కమిషనర్ మట్లాడారు. రూ.10 లక్షలతో మాచానిసోమప్ప నగర్ పార్కు అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని ఎంఈ మనోహర్‌రెడ్డి, ఏఈ షేక్‌షాలను ఆదేశించారు. ప్రేమ్ నగర్‌లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే పనులతు మొదలు పెట్టాలని సూచించారు. డ్రైనేజీలపై నిర్మించిన ర్యాంపుల తొలగించే చర్యలు చేపట్టాలని, మ్యాన హోల్స్ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్ చౌదరి, స్థానిక మాజీ కార్పొరేటర్ రాజేశ్వరరెడ్డి, శానిటేషన ఇనస్పెక్టర్లు మునిస్వామి, వార్డు సచివాలయ శానిటేషన సెక్రెటరీలు నిర్మల, గాయత్రి, ప్రవళిక, సురేఖ, పవనమూర్తి, విజయకుమార్, చిన్నరవి, ఆంధ్రజ్యోతి బ్రాంచ మేనేజరు ఎ.లక్ష్మన, బ్యూరో ఇనచార్జి గోరంట్ల కొండప్ప, ఏడీవీటీ మేనేజరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రూ.87 లక్షలతో డ్రైనేజీల్లో పూడికతీత
అక్షరం అండగా.. కార్యక్రమంలో పలు సమస్యలు ప్రజలు ప్రస్తావించారు. మంత్రి టీజీ భరత ఆ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఇచ్చిన హామీలో భాగంగా పారిశుధ్య పనుల స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఒక్కరోజుతో కార్యక్రమం ఆగిపోదు. ప్రతి సమస్య పరిష్కరిస్తాం. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. రాబోయే వర్షాకాలంలో డ్రైనేజీల్లో వర్షపునీటిని అడ్డంకులు లేకుండా రూ.87 లక్షలతో పూడికతీత పనులు చేపడుతాం. ప్రేమ్‌నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ నిర్మాణం చేపడుతాం. పార్కుల అభివృద్ధి చేపడుతాం. మాచాని సోమప్ప పార్కును వెంటనే రూ.10 లక్షలతో పనులు చేపట్టి వాకర్స్‌కు సౌకర్యాలకు కల్పిస్తాం. రాజీవ్‌గాంధీ పార్కు అభివృద్ధి చేస్తాం.
- పి.విశ్వనాథ్, కమిషనర్, నగరపాలక సంస్థ
ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమం
ఏబీఎన-ఆంధ్రజ్యోతి శుక్రవారం అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం నిర్వహించింది. మంత్రి టీజీ భరత దృష్టికి వివిధ కాలనీ ప్రజలు పలు సమస్యలు తీసుకొచ్చారు. ఎక్కువ మంది పారిశుధ్య పనులు, పార్కుల అభివృద్ధి చేయాలని కోరారు. మూడు రోజుల్లోనే నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ప్రత్యేక చొరవ తీసుకొని పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం, ఎన్నో ఏళ్లుగా మాచాని సోమప్ప నగర్ కాలనీ పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవడం అభినందనీయం. మంత్రి టీజీ భరత సహకారంతో 44, 45 వార్డుల్లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
- పి.రవికుమార్ చౌదరి, టీడీపీ నగర అధ్యక్షుడు, 44వ వార్డు
పార్కు అభివృద్ధి చేయాలి
రాజీవ్‌గాంధీ పార్కు ఇప్పటికే అభివృద్ధి చేశారు. వాకర్స్ కూడా చందాలు వేసుకొని పనులు చేసుకున్నాం. పార్కులో అధికారులు ఏర్పాటు చేసిన పిల్లలు ఆడుకునే ఆట వస్తులు, జిమ్ సామగ్రి ధ్వంసమయ్యాయి. వాటికి మరమ్మతులు చేపట్టాలి.
- ఆర్.వెంకట్రావు, రాజీవ్‌గాంధీ పార్కు
అధికారుల స్పందనకు అభినందనలు
నగరంలో ప్రజల అరోగ్యమే లక్ష్యంగా అధికారులు పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం హర్షించదగిన విషయం. ఏబీఎన-ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా.. కార్యక్రమంలో పార్కుల అభివృద్ధి, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి టీజీ భరత దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు స్పందించి మొదటగా పారిశుధ్య పనులపై ఫోకస్ పెట్డడం అభినందనీయం. రాజీవ్‌గాంధీ పార్కులో కూడా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని తక్షణం పరిష్కరించాలి.
- రాజేంద్ర, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి