నగరం..!
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:49 PM
కర్నూలు నగరంలో రోజురోజుకి ఎండవేడిమి ఎక్కువవుతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోని బయటికి రావాలంటే భయపడుతున్నారు.
ప్రజలతో పాటు వాహనదారులకు తిప్పలు
చలివేంద్రాలు, చలువ పందిళ్లకు చర్యలేవి?
కర్నూలు న్యూసిటీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో రోజురోజుకి ఎండవేడిమి ఎక్కువవుతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోని బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. నగరానికి చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. గతంలో ప్రదాన కూడళ్లలో స్వచ్చంద సంస్థలు, క్రెడాయ్, అపార్ట్‌మెంట్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిగతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అయిన నగర జనాభాకు ఇవి సరిపోవడం లేదు. దీంతో ప్రజలు దాహం తీర్చుకోలేక అల్లాడిపోతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల కోసం చలువ పందిర్లు...చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. నగర పాలక సంస్థ అధ్వర్యంలో ఎక్కడా కూడ చలివేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కొన్నిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లోని నీటితో పాదాచారులు దాహార్తి తీర్చుకుంటున్నారు. నిజానికి నగర పాలక సంస్థ అధ్వర్యంలో నగరలోని 12 కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. కమిషనర్ ఆదేశాలను సదరు ఉద్యోగులు ఏమాత్రం లెక్కచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చలువ పందిళ్లకు మాజీ కార్పొరేటర్ అడ్డు
నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద నగర పాలక సంస్థ అధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం టెండర్ ప్రాతిపదికన ఎంపిక చేసిన వారు నగరంలోని ప్రదాన కూడళ్లలో చలువ పందిళ్లు వేయాలి. అయితే 15 రోజుల క్రితమే నగర పాలక కమిషనర్ నగరంలోని 8 ప్రధాన కూడళ్లలో చలువ పందిర్లు వేసేందుకు టెండరు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు టెండరు వేసేందుకు ముందుకు వస్తుండటంతో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారు. సదరు మాజీ కార్పొరేటర్ ఫోన్‌లో ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించాడు. ‘మీ ప్రభుత్వంలో మీరు వేసుకున్నారు. మా ప్రభుత్వంలో ఇక మేమే వేసుకుంటాం. ముందుకొస్తే అంతే సంగతులు..’ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా టెండరుకు పోకుండానే ఆ మాజీ కార్పొరేటర్ చలువ పందిర్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. అదేవిధంగా టెండరులో పాల్గొనకుండా మరో కాంట్రాక్టర్‌కు గుడ్‌విల్ ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టెండరు దశలో ఉంది
నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు, చలివేంద్రాల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచాం. ప్రస్తుతం ఆ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెండర్లు పూర్తి కాగానే నగరంలో చలువ పందిర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాము.
- పి.విశ్వనాథ్, నగర పాలక సంస్థ కమిషనర్