చిరంజీవా..! చిన్నారిపై చిన్నచూపా..!
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:17 PM
ఎన్నో ఆశలతో.. సంతోషంగా మంత్రాలయానికి వచ్చిన కర్ణాటక భక్తుడి కుటుంబానికి తీరని శోకం మిగిలింది.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
విషాదాంతంగా మారిన ధార్మిక పర్యటన
మంత్రాలయంలో బాలుడిని ఢీకొన్న బస్సు
మంత్రాలయం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఆశలతో.. సంతోషంగా మంత్రాలయానికి వచ్చిన కర్ణాటక భక్తుడి కుటుంబానికి తీరని శోకం మిగిలింది. రెండు గంట క్రితం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న వారు ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించుకుని సంతోషంగా వచ్చారు. బిడ్డలు సంతోషంగా ఉండాలంటూ పూజలు చేసిన ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. పూజల అనంతరం తిరిగి వస్తుండగా బాలుడిని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తండ్రి గుండె బరువెక్కింది. అచేతనంగా ఉన్న బిడ్డను ఒళ్లో పెట్టుకుని ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి.. కంటతడి పెట్టించాయి. రెండు గంటల క్రితం సంతోషంగా నవ్వుతూ ఫ్యామిలీ ఫొటో దిగిన ఆ తల్లిదండ్రుల ఆనం దం ఒక్కసారిగా ఆవిరైంది.
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా కేఆర్ నగర్ తాలూకా వడ్డరకొప్పలు గ్రామానికి చెందిన హరీష్, చైత్రల రెండో కుమారుడు కార్తీక్ (4) రోడ్డు దాటుతుండగా రాయచూరు డిపోకు చెందిన కేఎస్ ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి దుర్మరణం పాలయ్యాడు. చిన్నపిల్లాడు కావడంతో బాలుడి శరీరం నుజ్జయింది. హరీష్, చైత్ర తమ ఇద్దరి పిల్లలతో పాటు మరో ఆరుగురు బంధువులతో కలసి రాఘవేంద్రస్వామి దర్శనార్థం సోమవారం రాత్రి మంత్రాలయానికి వచ్చారు. మంగళవారం సంప్రదాయ దుస్తులతో రాఘవేంద్ర స్వామిని మనసారా దర్శించుకున్నారు. ఆటోలో సమీపంలోని పంచముఖి, బిచ్చాల దర్శనార్థం వెళ్లారు. మార్గమధ్యలో అభయాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆటోను ఆపి కుటుంబమంతా దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా కార్తీక్ తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేగంగా రోడ్డును దాటేందుకు యత్నించాడు. అభయ ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న హైవేపై మంత్రాలయం నుంచి రాయచూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో టైర్లకింద తల నుజ్జునుజ్జయింది. కళ్లఎదుటే తమ చిన్నకొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు, అన్న పూర్విత్‌తో పాటు బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇద్దరు కొడుకులు ఉన్నారన్న సంతోషంతో ఈఏడాది రాఘవేంద్రస్వామిని దర్శించుకుని కార్తీక్‌ను పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇలా బస్సు రూపంలో చిన్న కొడుకును మృత్యువు అనంతలోకాలకు చేర్చిందంటూ కన్నీటి పర్యంతమ య్యారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. తండ్రి హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.