Share News

మిర్చి రైతులు దగా

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:32 PM

మిర్చి రైతులు దగా

మిర్చి రైతులు దగా

కర్నూలు యార్డులో నిండా ముంచేస్తున్న వ్యాపారులు

నిఘా పెట్టని అధికారులు

తక్కువ తూకం చూపి స్వాహా

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో దాదాపు 50వేల హెక్టార్లలో ఎండు మిర్చి పంటను రైతులు సాగు చేశారు. అయితే కర్నూలు మార్కెట్‌ యార్డులో వ్యాపారులు సిండికేట్‌ అయి వారిని దోచుకుంటున్నారు. ఎండుమిర్చిని తూకం వేసే సమయంలో అధికారులు ఎలక్ర్టానిక్‌ కాటాల వద్దకు వస్తారేమోనని, వ్యాపారుల దోపిడీని అడ్డుకుంటారేమో అని రైతులు ఆశిస్తున్నారు. కానీ అధికారులు కనీసం ఆ వైపు ముఖం కూడా చూపడం లేదు.

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

రైతుల్ని ముంచేస్తున్న వ్యాపారులు.. వారితో చేతులు కలిపిన అధికారులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు, తుఫాన్‌ కారణంగా మిర్చి దిగుబడి పూర్తిగా తగ్గిపోయి రైతులకు భారీ నష్టపోయారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండింది. నల్లి, తామర తదితర తెగుళ్లు, కీటకాల కారణంగా కేవలం 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే అందింది. కర్నూలు మిర్చి యార్డుకు ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయి రైతులు నిండా ముంచుతున్నారు. ఒక ఎకరా మిర్చి సాగుకు దాదాపు రూ.1లక్ష పైగానే ఖర్చు పెట్టి నష్టాలపాలవుతున్నామని రైతులు తెలిపారు.

ప్లాట్‌ఫారాలన్నీ వ్యాపారులకే ధారాదత్తం

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఏటా మార్చి నుంచి జూన్‌ వరకు ఎండుమిర్చి వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది. ఈ వ్యాపారం నిర్వహించేందుకు కూరగాయల మార్కెట్‌లో ఏడు ప్లాట్‌ఫారాలను సిద్ధం చేశారు. ఈ ఐదు ప్లాట్‌ఫారాలు వ్యాపారులకే ధారాదాత్తం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండుమిర్చిని బస్తాలు ఉంచుకోడానికి తమకు ప్లాట్‌ఫారాల్లో స్థలం ఉండటం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్లాట్‌ఫారాల్లో కనీసం సగమైనా తమకు కేటాయిస్తే బాగుంటుందని అధికారులను కోరుతున్నారు.

మిర్చి ఘాటుకు తట్టుకోలేరట.. అధికారుల వాదనతో విస్తుపోతున్న రైతులు

రైతులు అమ్మకానికి తెచ్చిన పంట ఉత్పత్తుల తూకాలను అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అయితే కూరగాయల మార్కెట్‌లోని వివిధ ప్లాట్‌ఫారాల్లో జరుగుతున్న ఎండుమిర్చి అమ్మకాల వైపు కనీసం నెలలో ఒక్కరోజు కూడా వెళ్లలేదు. ఈ విషయమై అధికారులను విచారిస్తే ఎండలు మండిపోతున్నాయని, మిర్చి ఘాటును తట్టుకోలేమని అధికారులు చెప్పడంతో రైతులు విస్తుపోతున్నారు. వ్యాపారుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు అధికారులకు తీరిక లేకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కాటా వద్ద పత్తాలేని అధికారులు

కర్నూలు మార్కెట్‌ యార్డులో మిర్చి తూకం వేసే సమయంలో సంబంధిత సూపర్‌వైజర్‌, ఇతర అధికారులు అక్కడ ఉండకుండా కార్యాలయాల్లో సేద తీరుతున్నారు. వ్యాపారులతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రైతులు ఎన్నోసార్లు తీసుకువచ్చినా మార్పు లేదు. మిర్చిలో తేమ శాతం ఎక్కువగా ఉందని తరుగు కింద తీసుకోవడం, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే అమ్మండి.. లేకపోతే వెళ్లిపోమని వ్యాపారులు గదమాయించడంతో రైతులు మిన్నకుండిపోతున్నారు. తూకం వద్ద సూపర్‌వైజర్లు, ఆ పై అధికారులు ఉంటే ఈ పరిస్థితి తమకు ఎదురయ్యేది కాదని, ఎన్నోసార్లు పై అధికారులకు చెప్పినా వారు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున జీరో వ్యాపారం

గుంటూర తర్వాత ఉమ్మడి జిల్లాలో కర్నూలు మార్కెట్‌ యార్డులోనే ఎండుమిర్చి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. రైతుల అవసరాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి పెద్ద ఎత్తున రైతులతో ఎండుమిర్చిని కొనుగోలు చేసి హైదరాబాదు, మద్రాసు, బళ్లారితో పాటు విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. దీంతో జీరో వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. మార్కెటింగ్‌ శాఖకు సెస్సు రూపంలో ఎండుమిర్చి నుంచి రూ.1 కోటి దాకా ఆదాయం రావాల్సి ఉంది. జీరో వ్యాపారం వల్ల చాలా వరకు సెస్సు ఆదాయానికి గండి పడింది. మార్కెటింగ్‌ శాఖకు పెద్ద ఎత్తున సెస్సు రూపంలో ఆదాయం రావలసి ఉన్నా జీరో వ్యాపారం వల్ల, వ్యాపారుల అక్రమాలకు అఽధికారులు చెక్‌ పెట్టకపోవడం వల్ల భారీగా నష్టం వస్తోంది.

మిర్చి రైతులకు అన్యాయం జరగనీయం

ఎండుమిర్చి తూకాల సమయంలో ఎలక్ర్టానిక్‌ కాటాల వద్ద తనిఖీ చేస్తాం. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

-జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ:

ప్లాట్‌ఫారాలన్నీ వ్యాపారులకే ఇస్తారా?

కర్నూలు మార్కెట్‌ యార్డులో ప్లాట్‌ఫారాలన్నీ వ్యాపారులకే ఇవ్వడం దారుణం. కూరగాయల మార్కెట్‌లోని ఐదు ప్లాట్‌ఫారాల్లో వ్యాపారులే మిర్చి బస్తాలను రోజుల తరబడి నిల్వ చేసుకుంటున్నారు. వారు ఇక్కడే రిటైల్‌ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఇది చాలా దారుణం.

- రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Mar 22 , 2026 | 11:32 PM