అనాథల్లా చిన్నారులు
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:54 AM
: వివాహేతర సంబంధం పిల్లల పాలిట శాపమైంది. అభం, శుభం తెలియని ఇద్దరు బాలలు అనాథలయ్యారు
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన బంధువులు
మార్చురీలో తల్లి మృతదేహం!
దేవనకొండ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం పిల్లల పాలిట శాపమైంది. అభం, శుభం తెలియని ఇద్దరు బాలలు అనాథలయ్యారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని లింగాపురం గ్రామంలో ఒకే చీరకు ఉరివేసుకుని ప్రియుడు రంగస్వామి, ప్రియురాలు ప్రమీల మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు ప్రమీలకు అంతకముందే వివాహం కావడంతో ఇద్దరు పిల్లలు మృత్యుంజయ(12), ప్రకాష్(7) ఉన్నారు. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ పరువు మర్యాదలు తీసిందంటూ బంధువుల్లో ఏ ఒక్కరూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే ఉంచారు. అయితే ఆమె పిల్లలు మృత్యుంజయ, ప్రకా్‌షలను కూడా బంధువులు తీసుకెళ్లకపోవడంతో చిన్నారులను పోలీసులు తమ వద్దే ఉంచుకున్నారు. పోలీసులు మానవతాదృక్పథంతో చిన్నారులను స్థానికుల వద్ద తాత్కాలికంగా రక్షణ కల్పించారు. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఏఎస్పీ విభూకృష్ణ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి పిల్లలను కడపలోని అమ్మఒడి పిల్లల ఆనాథశరణాలయానికి తరలించిన్నట్లు ప్రొద్దుటూరు సీఐ నాగభూషణ్, ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. పిల్లలకు అవసరమైన దుస్తులు, వస్తువులు పోలీసులు అందజేసి మానవత్వం చూపారు.