పాముకాటుతో బాలుడు మృతి
ABN , Publish Date - May 19 , 2026 | 12:34 AM
పాముకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన బైనదొడ్డి గ్రామంలో సోమవారం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
కోడుమూరు రూరల్ మే 18 (ఆంధ్రజ్యోతి): పాముకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన బైనదొడ్డి గ్రామంలో సోమవారం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన కురువ వీరేష్, పద్మావతి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఆ దంపతుల కుమారుడు ధర్మ(8) మధ్యా హ్నం తమ రేకుల గుడిసెలో ఆడుకుంటున్నాడు. అప్పటికే గుడిసెలోకి దూరిన పాము బాలుడి తలపై కాటు వేసింది. గమనించిన బాలుడు బయటకు పరుగున వచ్చి ఇరుగుపొరుగు వారికి విషయం తెలిపాడు. ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సమాచారం అందుకుని పరుగున ఇంటికి చేరుకున్నారు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సెలవులకు తల్లిదండ్రుల వద్దకు చేరి..
వీరేష్, పద్మావతి దంపతులది పేదకుటుంబం. ఆ కుటుంబం ఏటా సుగ్గిబాట వెళ్తుంది. దీంతో పిల్లల చదువుకు ఇబ్బంది కాకూడదని కుమారుడు ధర్మను అమ్మమ్మ ఇంట గొల్లలదొడ్డిలో ఉంచారు. అక్కడి నుంచే సి.బెళగల్‌కు తిరుగుతూ ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులతో ధర్మ స్వగ్రామానికి వచ్చాడు. అయితే పాము రూపంలో మృత్యువు కబలించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.