Share News

ఎగువ అహోబిలంలో రథోత్సవం

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:17 PM

లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో రథోత్సవం రమణీయంగా సాగింది.

 ఎగువ అహోబిలంలో రథోత్సవం

రమణీయం.. జ్వాలా నరసింహస్వామి రఽథోత్సవం

ప్రహ్లాదవరద స్వామికి కాళింగ నర్తనోత్సవం

ఆళ్లగడ్డ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో రథోత్సవం రమణీయంగా సాగింది. మఠం 46పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను స్వర్ణ దివ్య ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. పల్లకిపై ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని రఽథంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్‌ స్వామి పర్యవేక్షణలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవానికి వచ్చిన ప్రముఖులు స్వామి రథం వద్ద టెంకాయలు కొట్టిన తరువాత అర్చకులు, బోయిలు రథాన్ని ముందుకు లాగారు. రథంపై స్వామి అమ్మవారు విహరించగా భక్తులు దర్శించుకొని పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు తాడిపత్రికి చెందిన శ్రీనివాసాచార్యులు, శేషాద్రి నారాయణ అయ్యంగార్‌, నంబిలై స్వామి, తాడిపత్రికి చెందిన ఇటిక్యాల బాలిరెడ్డి ఉభయదారులుగా వ్యహరించారు.

దిగువ అహోబిలంలో..

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామికి కాళింగ నర్తనోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల్‌ స్వామి ఆఽద్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామిని పల్లకిలో కొలువుదీర్చి తిరు ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం తొట్టి తిరుమంజనం నిర్వహించగా రాత్రి అశ్వవాహనంపై స్వామి భక్తులకు దర్శన మిచ్చారు. ఈ పూజా కార్యక్రమాలకు అహోబిలానికి చెందిన కేశవన్‌ అయ్యంగార్‌, చెన్నైకి చెందిన వడపట్టు అరవముదన్‌, తాడిపత్రికి చెందిన జలదుర్గం రంగస్వామి ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ పూజా కార్యక్ర మాలను తిలకించేందకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు ఇబ్బందులు జరగకుండా ఆలయ సీఏవో రామానుజన్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 11:17 PM