పరిషత్ పోరు తేదీల మార్పు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:31 PM
పరిషత్ పోరు తేదీల మార్పు
నవంబరు 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
3న నగర, పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు
ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు
జిల్లాలో 12.50 లక్షల మంది ఓటర్లు
కర్నూలు మండలంలో అత్యధికంగా 77,575.. గూడూరులో అత్యల్పంగా 19,872 మంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. నవంబరు 3న జరగాల్సిన ఓటర్ల తీర్పును 5కు మారుస్తూ ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా బుధవారం రీ షెడ్యూల్ జారీ చేశారు. 5న జరగాల్సిన ఓట్ల లెక్కింపు 7వ తేదీకి వాయిదా వేశారు. పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు, పరిషత్ ఎన్నికల పోలింగ్ ఒకే రోజు రావడంతో భద్రతాపరమైన సమస్యలు.. సిబ్బంది కొరత సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిషత్ ఎన్నికల బరిలో తలపడుతున్న అభ్యర్థులకు సమ యం కాలసి రావడంతో ప్రచార వ్యూహా లకు మరింత పదును పెట్టే అవకాశం లభించింది. జడ్పీ, మండల పరిషత్ పాలకులు ఎవరో? తేల్చేందుకు 12.50 లక్షల మంది ఓటర్లు నవంబరు 5న తీర్పు ఇవ్వనున్నారు.
కర్నూలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు కావడంతో బరిలో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. 26 జడ్పీటీసీ స్థానాలకు 97 మంది పోటీలో మిగిలారు. పరిషత్ ఎన్నికల్లో మేము సైతం..! అంటూ 25 మంది డిగ్రీ ఆపై విద్యావంతులైన పట్టభద్రులు బరిలో నిలబడ్డారు. వారిలో ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతున్న మెడికో, ఎంటెక్, బీటెక్ చేసిన ఇంజనీర్లు ముగ్గురు, ఇద్దరు న్యాయ విద్యను అభ్యసించిన పట్టభద్రులు, ఎంబీఏ ఒకరు, ఎంసీఏ ఒకరు, ఎంఏ ఒకరు, 13 మంది డిగ్రీ పట్టభద్రులు పోరుకు సై అనడం ఆసక్తిగా మారింది. 26 మండలాల్లోని 432 మండల ఎంపీటీసీకు 2,054 మంది నామినేషన్లు వేయగా, 1,073 మంది వివిధ కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. 983 మంది బరిలో నిలబడ్డారు. 74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో, ఎన్నికలు జరిగే 358 స్థానాలకు 907 మంది పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థులు 337, వైసీపీ అభ్యర్థులు 349, జనసేన 38, బీజేపీ 10, ఇతర పార్టీలు, స్వతంత్రులు 173 మంది అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. నవంబరు 3న పోలింగ్ ఉండడంతో తక్కువ సమయం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులను కలవలేమనే ఆందోళన అభ్యర్థుల్లో ఉండేది. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీ సవరిస్తూ నవంబరు 5కు మార్చడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నగర, మున్సిపాలిటీ ఫలితాల ప్రభావం పరిషత్ ఎన్నికలపై చూపే అవకాశం ఉండడంతో తమకు కలిసొచ్చే అవకాశమని అధికార కూటమి అభ్యర్థులు అంటున్నారు.
తీర్పు ఇచ్చేందుకు 12.50 లక్షల ఓటర్లు సిద్ధం
జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక సభ్యుల భవిష్యత్ నిర్దేశించేందుకు 12,50,166 మంది ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. వారిలో పురుషులు 6,21,167 మంది ఉంటే, మహిళా ఓటర్లు 6,28,834 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 165 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 7,667 మంది ఎక్కువగా ఉన్నారు. అంటే.. పరిషత్ పోరులో నారీమణుల తీర్పు కీలకం కానుంది. మండలాల వారిగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలు రూరల్ మండలంలో 77,575 మంది ఓటర్లు ఉంటే, అత్యల్పంగా 19,872 మంది ఓటర్లు ఉన్నారు. సగటున ప్రతి మండలంలో 45 వేల నుంచి 50 వేల మంది ఓటర్లు తీర్పు ఇవ్వడానికి మేము కూడా సిద్ధం అంటున్నారు.
ప్రచార హోరు
జడ్పీటీసీ, ఎంపీటీసీ బరిలో తలపడే అభ్యర్థుల తుది జాబితా మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తక్కువ సమయం ఉండడం వల్ల గ్రామాల్లో పర్యటనలు, ఇంటింటి ప్రచారం, స్థానిక సమస్యలపై హామీలు, రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించారు. అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు ప్రచారం రంగంలో దిగారు. నిన్నటి వరకు పట్టణాల్లో హోరెత్తిన ప్రచారం.. తాజాగా పల్లెసీమల్లో ప్రచార హోరుతో ఒక్కసారిగా గ్రామ రాజకీయ మారిపోయింది. పల్లె రచ్చబండపై పరిషత్ చర్చలు జోరందుకున్నాయి. పరిషత్ పోరులో ఎవరి బలం ఎంత..? ఓటర్ల తీర్పు ఎటువైపు..? అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
పరిషత్ ఎన్నికల తాజా షెడ్యూల్
ఓటర్ల తీర్పు : నవంబరు 5న
రీపోలింగ్ : నవంబరు 6న
ఓట్ల లెక్కింపు : నవంబరు 7న
జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓటర్ల వివరాలు
మండలాలు : 26
మొత్తం ఓటర్లు : 12,50,166
పురుషులు : 6,21,167
మహిళలు : 6,28,834
ఇతరులు : 165